హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలని, పేదలపై ఆర్థికభారం తగ్గించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులు, వైద్యులను ఆదేశించారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 56 సీఆర్మ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆర్థోపెడిక్ సేవలపై మంత్రి హరీశ్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైనచోట ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటుచేస్తామని తెలిపారు. దవాఖానలకు నిధులు అందుబాటులో ఉన్నాయని, చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యరంగంలోని అనుభవజ్ఞులైన వైద్యులను సమన్వయం చేసుకొనేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. వైద్య నిపుణులందరితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా శస్త్రచికిత్సలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, వారి సహాయం పొందడానికి వీలుంటుందని చెప్పారు. జిల్లా దవాఖానలను బలోపేతం చేశామని, హైదరాబాద్‌కు రిఫర్ చేయడం తగ్గించాలని ఆదేశించారు.
ఉత్తమ సేవలకు అవార్డులు
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవల వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో అప్డేట్ చేస్తామని, నిరంతరం ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులను అక్రమంగా ప్రైవేట్‌కు తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఉత్తమ వైద్యసేవలు అందించే వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి ప్రతి నెల అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని ప్రకటించారు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన సేవలు బాగున్నాయని సూపరింటెండెంట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
తొలిసారిగా ఈ తరహా సమావేశం
వైద్యారోగ్యశాఖ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ప్రభుత్వ దవాఖానల్లోని ఎముకల వైద్య నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ తరహా సమావేశం ఇదే తొలిసారి. ప్రతి ఆదివారం ఒక్కొక్క స్పెషాలిటీ వైద్యంపై ప్రభు త్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్యులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, గాంధీ, నిమ్స్, అన్ని జిల్లా దవాఖానలు, మెడికల్ కాలే జీ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ యూనిట్ల హెచ్వోడీలు, డాక్టర్లు పాల్గొన్నా రు. ప్రైవేట్ దవాఖానల నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గురువారెడ్డి, అఖిల్ దాడి, సంజయ్ కల్వకుం ట్ల, సూర్యప్రకాశ్, నితిన్, ప్రవీణ్ హాజరయ్యారు.
ప్రభుత్వ వైద్యులకు సాయం చేస్తాం : ప్రైవేట్ వైద్య నిపుణులు
ప్రభుత్వ వైద్యులకు సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రైవేట్ ఆర్థోపెడిక్ డాక్టర్లు తెలిపారు. సమావేశానికి తమను ప్రత్యేకంగా ఆహ్వానించి, సలహాలు, సూచనలు స్వీకరించడం పట్ల మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. మోకాలు చిప్ప మార్పిడి చికిత్సలో ప్రభుత్వ వైద్యులకు సహకారం అందిస్తామని, అవసరమైతే జిల్లాలకు కూడా వస్తామని డాక్టర్ గురువారెడ్డి చెప్పారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి ఆసక్తి ఉంటే తమ దవాఖానను సందర్శించడంతోపాటు శిక్షణ పొందే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. డాక్టర్ అఖిల్ దాడి మాట్లాడుతూ.. వైద్యులు పేషెంట్ల పట్ల అంకిత భావంతో సమయం కేటాయిస్తే ఎకువ మందికి సేవలు అందించవచ్చునని పేర్కొన్నారు. డాక్టర్ నితిన్ మాట్లాడుతూ.. నూతన చికిత్స విధానాలపై పరిశోధనలకు ఎకువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. ఉస్మానియా, గాంధీ తదితర ప్రభుత్వ దవాఖానల్లో గొప్ప వైద్యులు ఉన్నారని, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని ప్రశంసించారు. వీటిని మరింత విస్తరించాలని సూచించారు.