జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : 30 నెలల కాంగ్రెస్ పాలనలో సింగరేణి కన్నీరు పెడుతున్నదని, సంస్థను కుంభకోణాలకు కేరాఫ్‌గా మార్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ పేరుతో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షత వహించారు.
హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని సింగరేణిలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని పీపీటీ ద్వారా వివరించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని, ఫిక్స్డ్ డిపాజిట్లతో కలకలలాడిన సింగరేణి నేడు అప్పులు ఊబిలో కూరుకుపోయిందన్నారు. సింగరేణి సంస్థ లాభాల్లో ఉంటే జీతాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సైట్ విజిట్, జైపూర్ పవర్ స్కాం, సింగరేణి బొగ్గు నిల్వల స్కాం, ఎక్స్ఫ్లోజివ్స్ స్కాం, డీజిల్ స్కాం, బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు, నైనీ బ్లాక్ టెండర్ బాగోతం.. ఇలా చెప్పుకుంటూపోతే కాంగ్రెస్ సర్కార్ స్కాంలు 30 నెలల్లో అనేకం చేశారని, ఇంకా బయటపడనవి ఎన్ని ఉన్నాయో తెలియదన్నారు.

13
తాము అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. కాంగ్రెస్ సర్కారును ఇలాగే వదిలేస్తే సింగరేణి సంస్థను అమ్మేస్తుందని, మేం ఇలా పీపీటీలతో వదలం.. అసెంబ్లీలో నిలదీసి కడిగేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. సింగరేణిలో ఏర్పాటు చేసిన 107, 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లతో ఎలాంటి ఉపయోగం లేదని, వీటితో సంస్థకు రూ. 1000 కోట్ల నష్టం జరిగిందని, జైపూర్ ప్ల్లాంట్తో రూ.750 కోట్ల నష్టం జరిగిందన్నారు. సింగరేణిలో ఏం జరుగుతున్నదో కార్మికులకు తెలియాలనే ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఈ ముచ్చట్లు ఇక్కడే వదిలేయకుండా రేపు గనుల మీద, కార్మిక వాడల్లో చర్చ పెట్టాలని కార్మికులను కోరారు.
బీఆర్ఎస్ ‘కాంగ్రెస్ హఠావో… సింగరేణి బచావో’ పేరుతో నిర్వహిస్తున్న సింగరేణి పరిరక్షణ సదస్సులు రేవంత్‌రెడ్డికి వణుకు పుట్టించాయని హరీశ్‌రావు అన్నారు. నాడు చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలకు పాతరేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటి ఊసెత్తలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాలను పునరుద్ధరించి 16 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించారని గుర్తు చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ కోల్‌బెల్ట్ బాట పట్టగా కాంగ్రెస్‌కు వణుకు పుట్టిందని, దెబ్బకు దెయ్యం దిగి వచ్చిందని, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కారుణ్య నియామకాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు.
ఇది బీఆర్ఎస్, టీబీజీకేఎస్ విజయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నేతలు దేవరకొండ మధు, బోగం నరేందర్, అవినాస్, నల్లబెల్లి సదానందం పాల్గొన్నారు.