హైదరాబాద్ ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు ఇవ్వరనే చిన్న కాంట్రాక్టర్లకు మొండి చెయ్యి చూపుతున్నదని మండిపడ్డారు. అప్పుల భారంతో ఊపిరి వదిలినా రేవంత్ సర్కార్ మాత్రం కనికరించడంలేదని ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లులు రాక, అప్పుల పాలై అరిగోస పడుతున్న ‘మన ఊరు-మన బడి’ సివిల్ కాంట్రాక్టర్లు హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. రెండేండ్లుగా బిల్లులు రాకపోవడంతో మిత్తీలు మీదపడి, అప్పులు పెరిగిపోయి అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయంగా బిల్లులు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని వాపోయారు. ఈనేపథ్యంలో హరీశ్‌రావు సోమవారం ఎక్స్‌వేదికగా స్పందించారు. గతంలో మండలి సాక్షిగా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్ల దయనీయ పరిస్థితిపై మాట్లాడిన వీడియోను తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. గుత్తా తన సొంతూరులో సైతం పనులు నిలిచిపోయి స్కూల్ పిల్లలు ఇబ్బందిపడుతున్నారని చెప్పినా సర్కార్ పెడచెవినపెట్టడం దురదృష్టకరమని వాపోయారు.
సర్కార్ బడుల బాగు కోసం కేసీఆర్ నాడు ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని అమలు చేశారని హరీశ్ గుర్తుచేశారు. దీని కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తున్నదని విమర్శించారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారని, దిక్కుతోచని స్థితిలో మరికొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ‘చిరు కాం ట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు పైసలు లేవంటున్న ప్రభుత్వం..పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. మీకు కమీషన్లు ఇవ్వరనే చిన్న కాంట్రాక్టర్లను గాలికి వదిలేశారా?’ అంటూ హరీశ్‌రావు సీఎం రేవంత్‌కు పలు ప్రశ్నాస్ర్తాలు సంధించారు.
చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రజావాణిలో కలెక్టర్లకు మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితంలేదని హరీశ్ వాపోయారు. తాను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేడుకున్నా కనీస స్పందన లేకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. చివరికి సచివాలయంలో ఆర్థిక చాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గానికి పరాకాష్ట అని అభివర్ణించారు. ‘కనీసం ఇప్పుడైనా మన ఊరు-మన బడి కోసం ఆర్థికశాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా? లేదంటే ఆ నగదు కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెడుతారా?’ అని ప్రశ్నించారు. పేద పిల్లలు చదువుకొనే పాఠశాలలను బాగు చేసిన చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వెంటనే 1500 మంది పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘కొందరు నా పేరిట ఫేక్ న్యూస్ సృష్టించి పోలీసులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నరు.. నేను వారిని దూషించినట్టు ఆన్లైన్ పేపర్ క్లిప్పింగ్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు’అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ ప్రజలు, పోలీసులను తప్పుదోవపట్టించేలా వార్తలు ప్రచురించడం మంచిదికాదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండదండలతోనే ఈ ఫేక్ న్యూస్ ముఠాలు రెచ్చిపోతున్నాయని సోమవారం ఎక్స్‌వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఫేక్ న్యూస్‌కు సంబంధించిన వార్తను తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. కొందరు దురుద్దేశ పూర్వకంగా ఒక వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. తప్పుడు వార్తలకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.