Harish Rao | పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి రూ.20లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్ ఫీజు కోసం లక్ష రూపాయలు కూడా అందజేశారు.
సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రం దంపతులకు నాలుగురు బిడ్డలు. వారిలో పెద్ద కూతురు మమతకు ఇటీవల పీజీ వైద్య విద్యలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లకు రూ. 22.50 లక్షలు కట్టాల్సి రావడంతో ఆమెకు ఏం చేయాలని తోచలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో మమత తండ్రి.. ఆ డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 చివరి తేదీ.. ఆ గడువులోగా ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి. బ్యాంకులో లోన్ కోసం వెళ్తే.. ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే కానీ రుణం మంజూరు చేయాలేమని బ్యాంకర్స్ చెప్పారు. అలాంటి సమయంలోనే తన బిడ్డల ఎంబీబీఎస్ చదువు కోసం సాయం చేసిన హరీశ్‌రావును కలిసి, తన పరిస్థితిని వివరించారు. దీంతో చదువుల తల్లికి సాయం చేయాలని భావించిన హరీశ్‌రావు.. మరో ఆలోచన చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేశారు. గతంలో మమత ఎంబీబీఎస్ చదువు కోసం హరీశ్‌రావునే సాయం చేశారు. అంతేకాకుండా ఆమె ముగ్గురు తోబుట్టువుల ఎంబీబీఎస్ చదువు కోసం కూడా హరీశ్‌రావునే సాయం చేయడం గమనార్హం.
మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబీబీఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కిందని సంతోష పడ్డా. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పీజీ చదివే యోగ్యం లేదని బాధపడ్డాను. కానీ అనాడు నాతో పాటు మా చెల్లెళ్లకు ఎంబీబీఎస్ చదవడానికి హరీశ్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో..లేదో అని టెన్షన్ పడ్డాం . మేము అడగడమే ఆలస్యం.. తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. చదువు విలువ, నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీశ్ రావు సార్ మన సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం.
నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చినవారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీశన్న ఏకంగా తన ఇంటిని మాకోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదు. నా నలుగురు బిడ్డలు హరీశ్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా.. రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నది. మరో ఇద్దరు అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో మేము ఒకరం. అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా మా పాప భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీశన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం.