Bala Krishna | వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తాజాగా దర్శించుకున్నారు. ‘అఖండ 2’ చిత్రానికి వస్తున్న అపూర్వ స్పందన నేపథ్యంలో చిత్రయూనిట్‌తో కలిసి బాలయ్య ఆధ్యాత్మిక నగరమైన కాశీకి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నేటి తరం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ‘అఖండ 2’ సినిమాలో తాను సనాతన సైనికుడిగా నటించానని, ఆ పాత్ర తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చిందని బాలకృష్ణ వెల్లడించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని తెలిపారు.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నిర్మాతలు, దర్శకుడు కలిసి కలసి సినిమా గురించి వివరించారని బాలయ్య పేర్కొన్నారు. సినిమా సందేశం, సనాతన ధర్మంపై ఉన్న అంశాలు ఆయనను ఆకట్టుకున్నాయని చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాలకృష్ణ అఘోరగా కనిపించిన లుక్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ వీక్‌లోనే గట్టి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ విజయవంతంగా రన్ అవుతోంది.
ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్ర కీలక పాత్రల్లో నటించి కథకు మరింత బలం చేకూర్చారు. బాలయ్య అఘోర అవతారంలో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘అఖండ 2’ విజయం నేపథ్యంలో కాశీలో స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని, ఈ సినిమా తన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని బాలకృష్ణ తెలిపారు. ఆధ్యాత్మికత, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ఇంకా ఎంతవరకు బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుందో చూడాలి.