నీలగిరి, ఆగస్టు 15:డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొందరు చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లసాధన కమిటీ పేరుతో ఆందోళన చేసిన సీపీఎం నేతలు ఈ అక్రమాలను సభ వద్ద బట్టబయలు చేస్తారనే భయంతోనే స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికార బలం తో సీపీఎం కార్యాయలంలోకి వెళ్లిమరీ మందస్తు అరెస్టులు చేశారు. వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కలల స్వప్నంలో ఒకటైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం పట్టణ శివారులోని కలెక్టరేట్ సమీపంలో 24 బ్లాక్‌ల్లో 576 ఇండ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
దాదాపు వాటిని పూర్తి చేశారు. అందులో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సమయం తీసుకుని పూర్తి చేశారు. శనివారం వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో తమ అక్రమాలు బయటకు వస్తాయనే కారణంతో ముందస్తుగా సీపీఎం నేతలను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఆ పార్టీ కార్యాలయంలోకి వెళ్లిమరీ అరెస్టు చేయడం గమనార్హం.
బీఆర్ఎస్ హయాంలోనే లబ్ధిదారుల ఎంపిక
2017లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్లను 2023లో 24 బ్లాక్ ల్లో 576 గృహాలను పూర్తి చేశారు. అప్పట్లోనే పట్టణంలో నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీంతో సుమారు 20 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అర్హుల బాబితాను ఎంపిక చేసి పోలీసు అడిటోరియంలో డ్రా పద్ధతిలో 421 మందిని ఎంపిక చేశారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ కేసులోని బాధితులు, రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయినవారు, కలెక్టర్ హామీ మేరకు అర్హులైన మరో 131 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
అంతలోనే అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో వాటిని పక్కన పెట్టారు. సీపీఎం, బీఆర్ఎస్ నేతలు ఇండ్లను పంపిణీ చేయాలని పలుమార్లు ఆందోళన చేశారు. జాబితాలో అనర్హులున్నారంటూ గత నవంబర్‌లో రీ సర్వే చేపట్టారు. ఎంపిక చేసిన 421 మంది లబ్ధిదారుల్లో సుమారు 20 నుంచి 30 మంది వరకు జాబితా నుంచి తొలగించారు. వివిధ కారణాలతో ఎంపిక చేసిన 131 మంది జాబితాలో లబ్ధిదారుల పేర్లను మార్చి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారి పేర్లను చేర్చారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు రెండు నుంచి మూడు డబుల్ బెడ్రూమ్లను కేటాయించినట్లు సమాచారం. కొందరు ప్రజాప్రతినిధులు తమ చేతివాటం ప్రదర్శించి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం డ్రా చేసినవారి పేర్లు ముందు పెట్టి ఎవరి పేర్లు మార్చలేదంటూనే రెండో దఫాలో ఎంపిక చేసిన 131 మంది జాబితాను పూర్తిగా మార్చేశారు. డ్రాలో ఎంపికైన వారి పేర్లు మార్చితే విమర్శలు వస్తాయనే భయంతో కొన్ని పేర్లు హోల్డ్‌లో పెట్టి 131 మంది లబ్ధిదారుల జాబితాను మార్చారు.
సీపీఎం నేత ఎండీ సలీం ముందస్తు అరెస్టు
రామగిరి, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ నల్లగొండలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి అడ్డంకులు సృష్టిస్తారనే అనుమానంతో నల్లగొండలోని సుం దరయ్య భవనంలో పోలీసులు సీపీఎం నేత, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీంను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులను సీపీఎం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులకు, సీపీఎం శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపెల్లి సత్తయ్య, అవుట రవీందర్, బొల్లు రవీందర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని గుర్రంపూడ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యను సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును హరిస్తూ పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడటం సిగ్గు చేటని మండిపడ్డారు. నిరసనకు ముందే నాయకులను గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అణచివేస్తారా? అని నిలదీశారు.