
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా విద్యార్థులకు తరగతులు సక్రమంగా జరుగకపోవడంతో దాని ప్రభావం ఫలితాలపై పడింది. ఇంటర్లో సగంకంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49% మంది విద్యార్థులే పాసయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 56% మంది ఉత్తీర్ణులవగా, బాలురు 42 శాతానికే పరిమితమయ్యారు. ఇంటర్మీడియట్ సెకండియర్లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించారు. వాటి ఫలితాలను అధికారులు గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మొత్తం 4,59,242 మంది విద్యార్థులకు 2,24,012 మంది పాస్‌కాగా.. 2,35,230 మంది ఫెయిలయ్యారు. ఉత్తీర్ణతలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 63 శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. ములుగు జిల్లా (61%) రెండోస్థానంలో, రంగారెడ్డి (60%) మూడోస్థానంలో నిలిచాయి. 20 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చివరిస్థానంలో ఉన్నది.
22 వరకు రీ వెరిఫికేషన్ గడువు
www.tsbie.cgg.gov.in,http://examresults.ts. nic.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఫొటో, సంతకాలతో కూడిన మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. రీ కౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, స్కాన్ కాపీతోపాటు రీ వెరిఫికేషన్ చేయించే విద్యార్థులు ఈ నెల 22లోపు పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
వొకేషనల్ కోర్సుల్లో 49 శాతం
వొకేషనల్ కోర్సుల్లో 40% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ కూడా 62 శాతంతో బాలికలే సత్తాచాటారు. బాలురు 39% మాత్రమే పాస్ అయ్యారు. ఈ ఫలితాల్లోనూ మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు జిల్లాలే అగ్రస్థానంలో నిలిచాయి.
హ్యుమానిటీస్ కోర్సుల్లోనే ఫెయిల్
హ్యుమానిటీస్ కోర్సులైన హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి కోర్సుల్లోనే అత్యధికులు ఫెయిలయ్యారు. ఈ కోర్సుల్లో 50% మాత్రమే ఉత్తీర్ణులవగా, ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ఉత్తీర్ణత మెరుగ్గానే ఉన్నది. వొకేషనల్ కోర్సుల్లో అగ్రికల్చర్లో 52%, బిజినెస్ అండ్ కామర్స్‌లో 51%, ఇంజినీరింగ్‌లో 39%, పారామెడికల్‌లో 60%, హోమ్‌సైన్స్ ఇతరత్రా కోర్సుల్లో 67% మంది పాసయ్యారు.
ఎంపీసీలో అత్యధిక మార్కులు
అత్యధిక మార్కుల విషయానికి వస్తే.. ఎంపీసీలో 470 మార్కులకుగాను 467, బైపీసీలో 440 మార్కులకు 438, ఎంఈసీలో 500కు 492, సీఈసీలో 500లకు 492, హెచ్ఈసీలో 500కు 488 మార్కులు వచ్చాయి. వీటిని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు సాధించారు. ఎంపీసీలో 466, బైపీసీలో 428, ఎంఈసీలో 478, సీఈసీలో 476, హెచ్ఈసీలో 461 మార్కులను ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సాధించారు. విద్యార్థుల్లో మానసిక ైస్థెర్యాన్ని నింపేందుకు, ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడేందుకు ఇంటర్‌బోర్డు ఏడు హెల్ప్లైన్లను ఏర్పాటుచేసింది. విద్యార్థులు 91549 51704/977/695/699/703/706/ 687 ఫోన్‌నంబర్లను సంప్రదించి క్లినికల్ సైకాలజిస్ట్‌ల కౌన్సెలింగ్ పొందవచ్చు.
ప్రభావం చూపిన కరోనా..
కరోనా కారణంగా తరగతులు పూర్తిస్థాయిలో జరుగకపోవడంతో ఫస్టియర్‌లో అధికశాతం విద్యార్థులు ఫెయిలైనట్టు తెలుస్తున్నది. జనరల్ కోర్సులు తీసుకుంటే 2019 ఫలితాల్లో 60.5%, 2018లో 62.73% మంది ఉత్తీర్ణులు కాగా, వొకేషనల్ కోర్సుల్లో 2019లో 53.2%, 2018లో 58.55% మంది పాసయ్యారు. ఈ ఏడాది జనరల్, ఒకేషనల్ రెండింటిలోనూ 49% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కరోనాతో ప్రస్తుత సెకండియర్లోని విద్యార్థులు 2019-20 సంవత్సరంలో ఎస్సెస్సీలో పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. 2020-21 సంవత్సరంలో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించకుండానే, సెకండియర్‌కు ప్రమోట్ అయ్యారు. వీరిని 40 రోజులు మాత్రమే ప్రత్యక్ష తరగతులను నిర్వహించారు. అత్యధిక కాలం టీశాట్, దూరదర్శన్, జూమ్యాప్ల ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించారు.
తక్కువ మార్కులు కలకలం..
కొందరు విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడం కలకలం సృష్టించింది. కొన్నింటిలో మంచి మార్కులు రాగా, మరికొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులొచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థికి ఆంగ్లంలో 92, సంస్కృతంలో 93, భౌతికశాస్త్రంలో 55, రసాయనశాస్త్రంలో 50 మార్కులు రాగా, గణితం ఏలో 27, గణితం బీలో 16 మార్కులే వచ్చాయి. ఆ విద్యార్థి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మరికొంత మంది విద్యార్థులకు సైతం ఇలా తక్కువ మార్కులొచ్చాయి. తాము బాగానే సమాధానాలు రాశామని, తమ తప్పేంలేదని ఇంటర్‌బోర్డు అధికారులే న్యాయం చేయాలని సదరు విద్యార్థులు కోరుతున్నారు.