H-1B Visa | మాంద్యం కారణంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా ఊరటనిచ్చింది. హెచ్1బీ వీసాల నిబంధనలపై ఉన్న గడువును సడలించేందుకు సుముఖత చూపించింది. హెచ్1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే కొత్త జాబ్ వెతుక్కునేందుకు ఆర్నెల్ల వరకు సమయం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం సిఫారసు చేసింది. ఇది అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెకీలకు ఉపశమనం లభించనుంది.
సాధారణంగా హెచ్1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే.. రెండు నెలల్లోపే కొత్త జాబ్ వెతుక్కోవాలి. ఈ లోపు ఉద్యోగం దొరక్కపోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రపంచ దేశాల్లో మాంద్యం కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఖర్చులు తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి. ఇలా వేలాది మంది రోడ్డున పడటంతో వాళ్లు కొత్త ఉద్యోగాలు సంపాదించడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలో వాళ్ల నుంచి వస్తున్న అభ్యర్థలను పరిగణలోకి తీసుకున్న అమెరికా అధ్యక్షుని సలహా సంఘం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగం కోల్పోతే కొత్త ఉద్యోగం చూసుకునేందుకు గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులు పెంచాల్సిందిగా సిఫారసు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. కాగా 2022 నవంబర్ నుంచి అమెరికాలో రెండు లక్షల మంది టెక్కీలు ఉద్యోగం కోల్పోయారు. వీరిలో 80 వేలమంది వరకు భారతీయులే ఉండొచ్చని ఒక అంచనా.