మల్దకల్, జూలై 14 : భవనం పై నుంచి కిందకు దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన పరశురాముడు, జయమ్మల కుమార్తె సంధ్య(10) హైదరాబాద్ సమీపంలో గల చౌటుప్పల్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నది.
సెలవులు ఉండడంతో పాఠశాల నుంచి గ్రామానికి వచ్చి తిరిగి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చారు. రాత్రి సమయంలో విద్యార్థిని నాలుగు అంతస్తుల పైనుంచి దూకి చనిపోయినట్లు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సోమవారం సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని లబోదిబోమంటూ రోధించారు. కాగా, విద్యార్థిని భవనం పైనుంచి దూకి చనిపోయిందా లేదా ఇంకేదైనా ఘటన చోటుచేసుకున్నదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.