అదే దేశ ప్రజల నిర్ణయం
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట రూరల్, మార్చి 1: ప్రధాని మోదీ సర్కారును గద్దె దింపాలన్నదే దేశ ప్రజల నిర్ణయమని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ర్టాల పాదయాత్రలు ఢిల్లీ వైపు సాగుతున్నాయని, ఢిల్లీ కోట నుంచి బీజేపీని గద్దె దింపాలన్న దేశ ప్రజల కోరికను నిజం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి శివాలయాల్లో జగదీశ్‌రెడ్డి దంపతులు పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రజలు పట్టించుకోవడం లేదని, పాదయాత్ర చేసినా ఆయన ప్రజలకు చెప్పేది ఏమీ ఉండదన్నారు. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా శూన్యమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్లో 25 ఏండ్ల బీజేపీ ఏలుబడిలో ఒక్క నిమిషం కరెంటు ఉచితంగా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏమిటన్నది ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని ఆయన కొనియాడారు.