ఇస్లామాబాద్: ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు దాడి చేశారు. సాయుధులైన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. (Gunmen attack vehicles In Pakistan) ఈ సంఘటనలో 38 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు. మహిళలతోపాటు పిల్లలు కూడా మృతులు, గాయపడిన వారిలో ఉన్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం గిరిజన కుర్రం జిల్లాలోని పరాచినార్లో సాయుధులైన వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. పెషావర్ నుంచి పరాచినార్‌కు, పరాచినార్ నుంచి పెషావర్‌కు ప్రయాణీకులతో వెళ్తున్న రెండు వ్యాన్లపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో 38 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు.
కాగా, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌదరి ఈ దాడిని ధృవీకరించారు. ఇది పెద్ద విషాదమని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ దాడిని ఖండించారు. ‘అమాయక ప్రయాణికులపై దాడి చేయడం పిరికి, అమానవీయ చర్య’ అని పేర్కొన్నారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో భూ వివాదంపై సాయుధ షియా, సున్నీ ముస్లింల మధ్య దశాబ్దాలుగా దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు.