తంగళ్లపల్లి, సెప్టెంబర్ 16 : బతుకుదెరువు కోసం గల్ఫ్‌బాట పట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లావాసి గుండెపోటుతో చనిపోయాడు. బంధువుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లెపు రవి (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయనకు భార్య మల్లీశ్వరి, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఈ నెల 10న దుబాయ్ (అబుదాబి)కి వెళ్లాడు.
వెళ్లిన ఐదు రోజుల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్టు మంగళవారం సమాచారం అందడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని గ్రామానికి తెప్పించాలని బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్‌కు తెలుపగా, ఆయన వెంటనే బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.