హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ సత్తా చాటింది. గత ఏడాదితో పోల్చితే 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్లో రాష్ట్రంలో రూ. 3,383 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో రూ.3,854 కోట్లు వసూలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నూతన పన్ను విధానం ప్రారంభమైన తరువాత వరుసగా రెండోసారి దేశంలో పన్ను వసూళ్లు పెరిగాయి. కరోనా మహమ్మారి నుంచి వ్యాపార, సేవా రంగాలు క్రమంగా కోలుకుంటుండటంతో జీఎస్టీ వసూ ళ్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో వసూళ్లు వరుసగా నాలుగో నెల రూ. లక్ష కోట్లు దాటాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండోసారి అత్యధికంగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో రూ. 1,30,127 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్రం వాటా రూ.23,861 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ కింద రూ.67,361 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.32,998 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ.8,484కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.699 కోట్లతో కలిపి) వసూలైనట్టు ఆర్థిక శాఖ తెలిపింది.