సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): నగరంలోని నార్త్ సిటీ మెట్రో విస్తరణకు అనూహ్యంగా రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. నిత్యం లక్షన్నరకు పైగా నార్త్ సిటీలోని పలు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు. ఓ వైపు ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులతో రవాణా సదుపాయాలు ఉన్నా.. మెరుగైన ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఈ ప్రాంతానికి అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో ప్రభుత్వం ఓ వైపు మెట్రో విస్తరణ, మరో వైపు నార్త్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలను అమలు చేస్తోంది.
కానీ, ఈ రెండు ప్రాజెక్టులలో నార్త్ సిటీ స్థానికుల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండానే డిజైన్లు ఖరారు చేస్తోంది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఎలివేటెడ్ కారిడార్‌తోనూ ఈ ప్రాంతానికి అన్యాయం చేసేలా వ్యవహారిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్, తూంకుంట వరకు మెట్రో విస్తరించాలనే డిమాండ్ పెరుగుతున్న సమయంలో, కేవలం ఎలివేటెడ్ కారిడార్‌తో చేతులు దులుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణంలో కీలకమైన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై స్పష్టత కోరుతున్నారు. ఎలివేటెడ్ పిల్లర్ల నిర్మాణం అయితే, భవిష్యత్తులో మెట్రో వచ్చే అవకాశం లేకుండా పోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రెండో దశ మెట్రో విస్తరణలో..
మేడ్చల్, తూంకుంట వరకు మెట్రో విస్తరించాలనే డిమాండ్ కొంత కాలంగా పెరుగుతూనే ఉంది. రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలోనే ఈ ప్రతిపాదనలకు డిజైన్లు కూడా ఖరారు చేశారు. ఒక అంతస్తులో మెట్రో, మరో అంతస్తులో రోడ్ వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్ ఖరారు చేసిన డిజైన్లలో ఈ ప్రతిపాదనలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే ఇప్పుడు స్థానికులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ పేరిట డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతుందని, అదే గనక జరిగితే భవిష్యత్తులో మెట్రో నిర్మాణం అసాధ్యంగా మారుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 19 కిలోమీటర్ల మేర పొడువైన రెండు ఎలివేటెడ్ కారిడార్ల కోసం ఓ వైపు భూసేకరణ పనులు జరుగుతుండగా, మరోవైపు డిజైన్లపై స్పష్టత లేకపోవడంతో స్థానికులు గందరగోళానికి గురవుతున్నారు.
రైట్ ఆఫ్ వే పేరిట తూట్లు…
నిజానికి మేడ్చల్ వరకు మెట్రో నిర్మించాలని స్థానికులు గడిచిన ఏడాదిగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో మెట్రో నిర్మాణానికి ఉద్యమిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఎదుటనే మేడ్చల్ వరకు మెట్రో నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కానీ, ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో లక్షలాది మంది నగరవాసులకు రవాణా సదుపాయాలు అందించే ఈ ప్రతిపాదనల అంశం ప్రధాని మోదీ వరకు తీసుకెళ్లినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండో దశ మెట్రో విస్తరణలో ఈ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ప్రాంతాన్ని విస్మరిస్తూనే డీపీఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి పంపింది. డీపీఆర్‌లో మేడ్చల్ ప్రాంతాన్ని చేర్చకుండా, మరోవైపు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను పక్కన పెట్టేలా హెచ్ఎండీఏ వ్యవహారిస్తుండటం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే గనక జరిగితే.. భూసేకరణతోనే ఏళ్లు గడిచిన ఈ ప్రాంతానికి భవిష్యత్తులో మెట్రో నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఇక మెట్రో వర్గాలు కూడా రైట్ ఆఫ్ వే లేదనే సాకుతో రెండో దశలో మేడ్చల్ వరకు మెట్రో ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదని తూట్లు పొడిచింది. ఈ క్రమంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభానికి ముందే, డబుల్ డెక్కర్ ప్రాజెక్టుపై, నార్త్ సిటీ మెట్రో నిర్మాణంపై స్పష్టతను ఇవ్వాలని కోరుతున్నారు.