హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ గురువారం సీఎస్ సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నందుకు సంఘం తరఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ ఇన్ వాలిడేషన్ సీం అమలుకు రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసి చైర్మన్‌ను నియమించాలని, ఉద్యోగులకు పలు మినహాయింపులకోసం రాష్ట్రస్థాయిలో గతంలో మాదిరిగా స్టాండింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని కోరారు. కొన్నిశాఖల్లో ఉద్యోగుల కు ప్రమోషన్లు ఇవ్వడంలో శాఖాధిపతులు జాప్యంచేస్తున్నారని, సీఎం ఆదేశాలకు అనుగుణంగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని విన్నవించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిషరించాలని త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, నల్లగొండ జిల్లా సంఘం అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.