నిజామాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవ ఘట్టం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. తొలిరోజు దేవనపల్లి అనిల్, అరుణ్ ఇతర కుటుంబీకుల సమక్షంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. దేవనపల్లి వంశీయుల సొంతూరు నవీపేట మండలంలోని పోతంగల్ నుంచి గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-దేవనపల్లి అనిల్, దేవనపల్లి అరుణ్-ననిత దంపతులు ఆలయ ప్రాంగణానికి చేరుకోగా రుత్వికులు, సాధువులు స్వాగతం పలికారు.
లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి మార్గదర్శకంలో శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ, యంత్ర ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం వంటి మహాధార్మిక క్రతువులను నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో విష్ణు సహస్ర నామ పారాయణం కన్నుల పండువగా సాగింది. తీర్థ ప్రసాద గోష్టితో మొదటిరోజు కార్యక్రమాలు వేడుకగా ముగిశాయి. ఎమ్మెల్సీ కవిత కుమారులు దేవనపల్లి ఆదిత్య, దేవనపల్లి ఆర్య సంప్రదాయ దుస్తుల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆలయం అంటే ఎన్నటికీ లయం కానిదని, అవి తరతరాలకు తరగని సంపదనిస్తూ జ్ఞానాన్ని అందిస్తూ మానవజాతికి జీవనాడిగా ఉంటున్నాయని తెలిపారు. శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం పూర్వజన్మ సుకృతమే కాదు హైందవ ధర్మ పరిక్షణలో కీలకమైన అంశమని చెప్పారు.