మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం ఆలయం (Srisailam Temple) లో సోమవారం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆలయ దక్షిణమాడవీధిలో నిర్వహించిన పోటీల్లో 15 మంది మహిళలతోపాటు నెల్లూరు నుంచి వచ్చిన భక్తులు సైతం పాల్గొన్నారు. ఈ పోటీలకు దేవస్థానం అధికారులు పి. దేవిక, కోమలి, అనురాధ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా విజేతలు జి. లక్ష్మీదేవి, రోజారాణి, ఉమాదేవి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు.

శ్రీశైలానికి చెందిన ఈషా, ఇందిరమ్మ కంభానికి చెందిన ప్రవల్లిక కన్సోలేషన్ బహుమతులు సాధించగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు(Chairman) రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు బహుమతులందజేశారు. వారు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.


ముగ్గును శుభానికి, మంగళత్త్వానికి ప్రతీకగా భావిస్తారని, లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించే అంశాలలో రంగవల్లు ఒకటని అన్నారు. విజేతలకు స్వామిఅమ్మవార్ల ప్రసాదాలతో పాటు శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, దేవస్థానం క్యాలెండర్ను అందజేశారు. అనంతరం సంకాంత్రి పండుగ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానికులతో కలిసి పతంగులను ఎగురవేశారు.