కుభీర్ : మండల కేంద్రంలోని కానోబా వీధి శ్రీకృష్ణ ఆలయంలో ఐదు రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami ) వేడుకలు ఆదివారం అన్నదానంతో ముగిశాయి. శనివారం అర్ధరాత్రి శ్రీకృష్ణుని జననం అనంతరం ఊయలలో శ్రీకృష్ణుని ప్రతిమకు నామకరణం చేసే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అనంతరం చిన్ని కృష్ణుని వేషధారణలో చిన్నారి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఆదివారం తెల్లవారుజామునే ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో పూజారులు అభిషేకం చేసి పట్టు వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలను చేశారు. గ్రామంలో శోభాయాత్ర అనంతరం ప్రత్యేక కాలా కీర్తన తో వేడుకలు ముగిశాయి. అనంతరం కుభీర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు తిప్ప భోజన్న, పుప్పాల పీరాజీ, సిద్ధం బార్ నిరంజన్, గిరి పోశెట్టి, నాగలింగం, గల్లి వాసులు సభ్యులు పాల్గొన్నారు.కుప్టి గ్రామంలోనూ శ్రీకృష్ణ దేవాలయంలో వేడుకలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి.