వరంగల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోజురోజుకు బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతున్నది. తొలి, మలి విడతలకు మధ్య 7.37 శాతం బీఆర్ఎస్ వృద్ధి సాధించింది. అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభ తగ్గిపోతున్నది. ఇలా తీర్మానిస్తున్నది రాజకీయ ప్రత్యర్థులు కాదు.. సాక్షాత్తూ ప్రజలు. అందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి, మలి దశ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ తగ్గిపోతున్నదని, సీఎం రేవంత్రెడ్డి గ్రాఫ్ పడిపోతున్నదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఈసడించుకుంటున్నారని పల్లె తీర్పు పటాపంచలు చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాదు కదా కాంగ్రెస్ కుటుంబ గాంధీలొచ్చినా ప్రజాభిమానాన్ని మార్చలేరనే అభిప్రాయం బలపడుతున్నది.
అధికార దర్పాన్ని చూపించి, ప్రలోభ పర్వానికి తెరతీసినా కాంగ్రెస్ ప్రజల మనసు గెలుచుకోలేదని పల్లె తీర్పుతో స్పష్టం అవుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి ఫలితాలకు, మలి ఫలితాలకు మధ్య బీఆర్ఎస్ పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్టు పుంజుకుంటున్నదని స్పష్టం అవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ తొలి విడతలో ఎన్నికలు జరిగిన 502 గ్రామ పంచాయతీల్లో 149 గ్రామ పంచాయతీలను సొంతం చేసుకొని దాదాపు 30 శాతం (29.68 శాతం) పల్లెల్లోగులాబీ మద్దతు దారులు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 506 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో 187 జీపీల్లో బీఆర్ఎస్ మద్దతు దారులు జయకేతనం ఎగురవేశారు. అంటే మొదటి రెండో దశ ఎన్నికల ఫలితాలకు మధ్య దాదాపు రెండు శాతం (1.82 శాతం) మేర బీఆర్ఎస్ పుంజుకున్నది. ఈ లెక్కన బీఆర్ఎస్ రోజుకో శాతం చొప్పున పురోగమిస్తుండగా, కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నది.
సీఎం రేవంత్రెడ్డి కాలికి బలపంకట్టుకొని తిరిగినా కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తగ్గదని పంచాయతీ ఎన్నికలు తేల్చిచెప్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, వివిధ వృత్తికారులు కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేందుకు పల్లె ప్రజాతీర్పే నిదర్శనం. ఈ క్రమంలోనే ఈనెల 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు, ఆదివారం జరిగిన మలి విడత ఎన్నికల ఫలితాలకు మధ్య ఉన్న బీఆర్ఎస్ పురోగమనమే నిదర్శనమని అంటున్నారు.