మిగిలిన పనులను రేపటికి వాయిదా వేసి
కునుకు కోసం పెద్ద తపస్సు చేస్తుంది నగరం
నిద్ర రావాలంటే మత్తు మందు మింగాలి మరి
పల్లెను వదిలిన నాడే ప్రశాంతత కోల్పోయినది
ప్రతి నిమిషం పరుగుల పందెము లాంటిదే
భూమిని మించిన భ్రమణం పట్నం బతుకుది
రాత్రి పగలు విభజన లేదు నగరానికి
షిఫ్ట్‌ల వారీగా దోపిడీలు కుట్రలు
ముప్పు అన్ని దిక్కుల నుంచి రావచ్చు జాగ్రత్త
నాలుగు గింజలు ఇక్కడ లభించును
జీవితాన్ని మాత్రం తాకట్టు పెట్టాలి సుమా
చెమట తుడుచు యంత్రాలు తగిలించుకుని
రెండు ప్రేమ పక్షులు ఇక్కడికి చేరాయి
పగలు ఒకరు రాత్రి ఒకరు పనికి కుదిరారు
తీరా కలయిక కల అయి కూర్చుంది
శత్రువులు వూరికే వస్తారు ఇక్కడ
ఎదుగుదలకు ఎన్నో అసూయ కళ్లు
రహస్యంగా బతికినోడే చివరి వరకు
నగరం నోట్ల కదలిక ఉన్నంత వరకు నీతో
పబ్‌లు క్లబ్‌లు ఎనెన్నో పెనవేసుకుంటాయి
అవసరానికి హటాత్తుగా మ్యూట్‌లోకి వెళ్లుతుంది
నగరం ఎవరినీ వదిలి పెట్టలేదు
ఆశను ఎర చూపి ఈఎంఐలో ఇరికించి
గుండెను దౌడు తీయించి బ్రతుకు ఐసీయూలో
నగరం మనుష్యులతో నిండిపోయింది కానీ
కోరికల వేటలో మనసులు దారి తప్పి
జీతం జాతరలో జీవితం ఆదరా బాదరాగా…