ప్రామాణిక వైయాకరణుల గ్రంథాలు, భాష్యకారుల రచనలు చదువుతున్న కొద్దీ ఆనాటి పండితుల్లో సైతం ఏవో తెలియని గడబిడలుండేవని తెలుస్తుంది. వారి భ్రమల వల్లో, ఇతర కారణాల వల్లో వారి రచనల్లో కొన్ని తారుమారులు, ఆక్షేపణలు దొర్లాయని కూడా అర్థమౌతోంది.
నేడు కూడా మనలో కొందరు వ్యాస రచయితలు అదే రీతిగా భ్రమలు, ప్రలోభాలకు గురవుతూ నిజమైన వైయాకరణులకు అన్యాయం చేస్తున్నారా? గత చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకున్నదేనా? అన్న భావనలు కలుగుతున్నాయి. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అయినా ఆ దుష్ప్ర‘భావ’జాలాలు వదలకపోవడం, విశాల దృక్పథం కొరవడటం బాధాకరమే!
గ్రాంథిక భాషకు వ్యాకరణ రచన ‘ఆంధ్ర శబ్ద చింతామణి’తో మొదలై డాక్టర్ వడ్లమూడి గోపాల కృష్ణయ్య(వ.గో.కృ)తో ఆగిపోయింది. చాలామంది బహుజనపల్లి వారే గ్రాంథిక భాష వ్యాకరణ రచనలో చివరి వారనుకుంటారు కానీ, డాక్టర్ వ.గో.కృ. పరిష్కరించిన సమూల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత (తి.తి.దే) సంపుటాలు చదివితే కొత్త ఛందస్సులో అనువాద పద్యాలు దర్శనమిస్తాయి. అంటే డాక్టర్ వ.గో.కృ. కూడా చివరగా గ్రాంథిక భాషకై కొద్దో గొప్పో వ్యాకరణాన్ని జోడించినట్లే కదా!
వ్యావహారిక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఇద్దరు పెద్ద ఉద్యమమే చేసి ‘వ్యావహారిక భాషకు వ్యాకరణం రచిస్తామని ఘంటాపథంగా శపథం చేశారు. ఆ తర్వాత వారు రాయలేక కన్ను మూశారు. ‘వ్యావహారిక భాషా వ్యాకరణం’ అనే శీర్షికనే అందిపుచ్చుకొని 1956లో వాఙ్మయ మహాధ్యక్ష డాక్టర్ వడ్లమూడి గోపాల కృష్ణయ్య తన 29వ యేటే 1474 సూత్రాలతో అమోఘమైన (యాసభాషల) వ్యాకరణం రచించి, 1958లో ప్రథమ ముద్రణగా వెలువరించారు. ఈ ఉద్గ్రంథం అప్పటి ప్రసిద్ధ కవి పండితుల, ఆచార్యుల ప్రశంసలందుకొని, ప్రామాణికతకు సూచికగా నిలిచింది. 1990 సంవత్సరం తర్వాత మార్కెట్లో ఈ వ్యాకరణ గ్రంథం అందుబాటులో లేనందున, సినిమా మీడియా ప్రభావం వల్ల ఆ గ్రంథ ప్రాచుర్యం తగ్గింది.
ఫలితంగా ఇప్పుడు సూత్రాల రూపేణా ఉన్న వ్యాకరణమే అసలైందని పదే పదే చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. పైగా కొందరు అసలు వ్యావహారిక ‘భాషా వ్యాకరణ’మే లేదని బుకాయింపు రచనలు చేయనారంభించారు.
ఇలాంటి బ్లాక్మెయిల్ రచనలు మన తెలుగు సాహిత్యంలో గతంలో కూడా జరిగాయంటే నమ్మశక్యం కాదు. సాక్షాత్తూ ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ గ్రంథమే సుమారు 600 ఏండ్లు అజ్ఞాతంలో ఉంది. ‘అధర్వణ కారికలు’ కూడా సుమారు 300 ఏండ్లు అజ్ఞాతంలోనే ఉంది. ఈ రెండు విషయాలనూ అహోబిలుడనే పండితుడు తన పద్యాల్లో తెలిసో తెలీకో పొందుపరిచాడు. ఇతని నిజనామం ‘గాలి ఓబులయ్య’. ఈ పేరు గంభీరంగా లేదనో ఏమో.. ఆ పేరును సంస్కృతీకరించి ‘ప్రభంజనం-అహోబిలపతి’గా తన గ్రంథాలలో రాసుకొన్నాడని విదితమవుతోంది.
కాగా ఈ అహోబిలుడే – కేతన మహాకవి రచించిన ‘ఆంధ్రా భాషా భూషణం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని చదివి బాగా ఆక్షేపించాడు. ఇందుకు కారణం చింతామణి వ్యాకరణ గ్రంథం ఉన్నదని తెలిసీ దాన్ననుసరించాక కేతన తనదైన శైలిలో కొత్త వ్యాకరణ రచన చేశాడన్న భ్రమతోనే అహోబిలుడు ఆక్షేపిస్తూ కొన్ని రచనలు చేశాడు. అంతేకాక మరికొందరు సమకాలికులు సైతం కేతనను బాగా ఆక్షేపించారని చరిత్ర చెప్తున్నది. అప్పటి అవాంఛనీయ పోకడలు నేడు కూడా వ్యాకరణాల విషయంలో పునరావృతమవుతుండటం తీవ్ర విచారకరం.
గత చరిత్రలో జరిగిన ఈ మంచిచెడుల గురించి తెలిసో తెలీకో ప్రస్తుతం సీనియర్ జర్నలిస్టు వడ్లమూడి రాజఫణి తన తండ్రి గారు రచించిన 1958లో ప్రథమ ముద్రణగా వెలువడిన ‘వ్యావహారిక భాషా వ్యాకరణం’ గ్రంథాన్నే స్వల్ప మార్పులతో ద్వితీయ ముద్రణగా తేవడం మన తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు గర్వకారణం.
శేముషి డాక్టర్ వడ్లమూడి గోపాల కృష్ణయ్య ప్రపథమంగా రచించిన తన గ్రంథంలో తెలుగు భాషాభివృద్ధి కావాలన్న కాంక్షతో 1956లోనే దాదాపు 20కి పైగా కొత్త అక్షరాలను సృష్టించి చూపారు. అవి అనాదిగా మన ఉచ్ఛారణలో ఉన్నా లిఖిత రూపంలోకి రాలేదు. అన్నీ అభివృద్ధి చెందుతున్నా తెలుగు భాష మాత్రం అభివృద్ధి చెందకపోవడం విచారకరం. ఇప్పటికైనా కొత్త అక్షరాలను వాడుకలోకి తెచ్చుకోగలిగితే నిఖార్సయిన భాషాభివృద్ధికి గీటురాళ్లవుతాయి. పద పరిచ్ఛేదాలతో ఉన్న ఈ వ్యాకరణంలోని సూత్రాలన్నీ మన యాస భాషలకు దగ్గరగా ఉన్నాయి. వడ్లమూడి గోపాల కృష్ణయ్య దార్శనికత తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల వారిని రంజింపజేస్తుందనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా దుర్బుద్ధులకు భవిష్యత్తులో ‘చెక్’ పెట్టే విధంగానే కాక తెలుగు భాషాధ్యయనం చేసే విద్యార్థినీ విద్యార్థులకు దిక్సూచిగానో, మార్గదర్శకంగానో ‘వ్యావహారిక భాషా వ్యాకరణం’ దర్శనమిస్తుంది.