న్యూఢిల్లీ, జూలై 10 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంపై మళ్లీ మోదీ సర్కారు దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే జీవిత బీమా రంగ కంపెనీ ఎల్ఐసీపై కన్నేసింది. దీంతో ఆ పనిని చక్కబెట్టేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ వర్గాలు రంగంలోకి దిగాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఎల్ఐసీలో వాటాను అమ్మేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, తదుపరి చర్యలపై ఇప్పుడే చర్చలు మొదలయ్యాయని సంబంధిత అధికారులు చెప్తున్నారు. మార్కెట్ పరిస్థితులనుబట్టి ఓ నిర్ణయానికి వచ్చే వీలుందని, అలాగే ఎంత వాటాను అమ్మేయాలి, ఏ ధరకు విక్రయించాలి, ఎప్పుడు పబ్లిక్ ఇష్యుకు రావాలన్నది త్వరలోనే తెలియవచ్చని వారు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 3.5 శాతం వాటాను అమ్మేసి దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. 2022 మే నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా జరిగిన ఈ వాటాల అమ్మకంతో దాదాపు రూ.21,000 కోట్ల నిధులను ఖజానాకు కేంద్రం తరలించింది. రూ.902-949 ధరల శ్రేణిలో వచ్చిన ఆ పబ్లిక్ ఇష్యూకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించిన సంగతీ విదితమే. కాగా, ఎల్ఐసీలో ఇంకా కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉన్నది.
ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయం ఈ ఏడాది అక్టోబర్‌కల్లా పూర్తవుతుందన్న ఆశాభావాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటా కొనుగోలు ఒప్పందంపై ప్రభుత్వం చర్చించిందని, ఆసక్తిగల కొనుగోలుదారులు తమ బిడ్లను దాఖలు చేసేందుకు మార్గం సుగమమవుతున్నదని ఓ అధికారి అంటున్నారు. అయితే మూడేండ్లుగా ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రస్తుతం బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 30.48 శాతం వాటా, ఎల్ఐసీకి 30.24 శాతం వాటాలున్నాయి. దీంతో తమకున్న మొత్తం 60.72 శాతం వాటాను అమ్మేసి బ్యాంక్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి 2022 అక్టోబర్‌లోనే ఆసక్తిగల ఇన్వెస్టర్లు ముందుకు రావాలంటూ ఎల్ఐసీతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ క్రమంలో 2023 జనవరిలో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కొన్ని బిడ్లను అందుకున్నది. అయినా ఫలితం లేకపోయింది. నిజానికి హోం మినిస్ట్రీ, ఆర్బీఐ నుంచి కావాల్సిన అనుమతులున్నా అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రయత్నాలను కేంద్ర ముమ్మరం చేస్తున్నది. బీఎస్ఈలో కంపెనీ షేర్ విలువ రూ.99.85 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.99.83 వద్ద ముగిసింది.
గత నెల వ్యక్తిగత బీమా ప్రీమియంలకు సంబంధించిన ఆదాయంలో ఎల్ఐసీ 14.60 శాతం వృద్ధిని చూసింది. ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చితే ఇది 12.12 శాతం అధికమని గురువారం లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. జూన్‌లో ఎల్ఐసీ రూ.5,313 కోట్ల వ్యక్తిగత బీమా ప్రీమియంలను వసూలు చేసింది. అయితే ఇదే సమయంలో 25 ప్రైవేట్ రంగ బీమా సంస్థలు కలిసి వసూలు చేసిన మొత్తం రూ.8,408 కోట్లుగా ఉన్నది. ఇది దేశీయ బీమా పరిశ్రమలో ఎల్ఐసీ ఆధిపత్యానికి అద్దం పడుతున్నది. ఇక జూన్‌లో ఎల్ఐసీ జారీ చేసిన మొత్తం పాలసీల సంఖ్య 12.49 లక్షలు. అయితే నిరుడు ఇదే నెలలో 14.65 లక్షలుగా ఉన్నాయి. వీటిలో ఈసారి వ్యక్తిగత బీమా పాలసీలు 12.48 లక్షలుగా, గ్రూప్ పాలసీలు 1,290గా ఉన్నాయి. పోయినసారి ఇవి వరుసగా 14.62 లక్షలుగా, 2,827గా ఉన్నాయి. జూన్‌లో గత ఏడాదితో చూస్తే గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం కూడా 7 శాతం తగ్గి రూ.22,087 కోట్లుగా నమోదైంది. ప్రైవేట్ రంగ సంస్థలదీ 19 శాతం పడిపోయి రూ.5,315 కోట్లుగా ఉన్నది. జూన్‌లో ఎల్ఐసీ మొత్తం ప్రీమియం ఆదాయం 3.43 శాతం క్షీణించి రూ.27,395 కోట్లు ఉంటే, ప్రైవేట్ రంగ సంస్థలది 2.45 శాతం పతనమై రూ.13,722 కోట్లకు పరిమితమైంది.
ఈసారి ఎల్ఐసీలో కనీసం 6.5 శాతానికి తగ్గకుండా వాటాలను అమ్మేయాలని మోదీ సర్కారు యోచిస్తున్నది. దీంతో మార్కెట్లో ఇప్పుడున్న షేర్ ధరల ప్రకారం ఎంతలేదన్నా రూ.40,000 కోట్లపైనే నిధులు ఖజానాకు తరలివచ్చే వీలున్నదని చెప్పవచ్చు. కాగా, 2027 మే 16 నాటికి ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 10 శాతమైనా ఉండాలన్న నిబంధన ఉన్నది. దాన్ని ఎల్ఐసీ చేరుకోవాలంటే మరో 6.5 శాతం వాటాను తప్పక అమ్మేయాల్సిందే. అయితే ఒకేసారి ఆ వాటాను అమ్మేస్తుందా? లేక రెండు, అంతకన్నా ఎక్కువసార్లు పబ్లిక్ ఇష్యూలకు వెళ్లి సొమ్ము చేసుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఎల్ఐసీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.5.85 లక్షల కోట్లు. గురువారం బీఎస్ఈలో రూ.926. 85 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.926.90 వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో చూస్తే 2 శాతానికిపైగా నష్టపోయింది.