మునుగోడు, జూలై 29 : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ మునుగోడు మండల కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ మునుగోడు మండల అధ్యక్షుడు పగిళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి కట్ట దశరథ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల కారణంగా ప్రజలకు సేవలు సక్రమంగా అందడం లేదని, ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుండగా మరోవైపు ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి, పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతో కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షులు కట్కూరి లింగస్వామి, శివర్ల నాగరాజు, మండల కార్యవర్గ సభ్యులు పగిళ్ల బాబా, బోయపల్లి సాయి, కిరణ్ పాల్గొన్నారు.