భూదాన్ పోచంపల్లి, మే 11 : ధాన్యo కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని గౌస్ కొండ, రేవనపల్లి, భీమనపల్లి గ్రామాల్లోని ధాన్యo కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి ఎన్ని రోజులు అయిందని, ధాన్యం కొంటున్నారా, బస్తాకు ఎన్ని కేజీలు తూకం వేస్తున్నారు? తూకం వేసిన ధాన్యం లారీలో మిల్లులకు ఎందుకు తీసుకెళ్లడం లేదని, కేంద్రాల్లో ఎన్ని ధాన్యం రాశుల కుప్పలు ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. భీమనపల్లిలో కొనుగోలు కేంద్రాలకు దాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్న కొర్రీలు పెడుతూ ధాన్యం కొనుగోలు చేయకపోవడం సరి కాదని, ఎండలో ఉండి భర్తకు అనారోగ్యాన బారిన పడి గ్లూకోజ్ పెట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాకు 42 కిలోలు తూకం వేస్తూ, లారీకి బస్తాకు ఒక రూపాయి చొప్పున తీసుకుంటున్నారన్నారు. అన్నం పెట్టే రైతులను ఇంత క్షోభ పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు.
ముందస్తుగా ప్లానింగ్ లేకపోవడం, జిల్లా కలెక్టర్, జెసి, ఆర్డిఓ, అధికారులతో సమావేశమై కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో మూడు రోజుల తర్వాత ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నారాయణపురం, మునుగోడు ప్రాంతాలకు చెందిన ధాన్యాన్ని పోచంపల్లి మండలానికి చెందిన చెందిన రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారన్నారు. భూదాన్ పోచంపల్లి మండలానికి చెందిన రైతుల ధాన్యాన్ని స్థానిక మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్ని కష్టాలు అని, సర్కార్ నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఆయన ఆరోపించారు. లారీలు రాకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. అకాల వర్షం ప్రమాదం పొంచి ఉందని, వానలు పడి ధాన్యం తడిస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు కంటినిండా నిద్రపోయారని, వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ధాన్యం కొనుగోల్లో వేగం పెంచాలని, రైతులను ఇబ్బంది పెడితే మహా ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్ , పిఎసిఎస్ చైర్మన్ కం దాడి భూపాల్ రెడ్డి , మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు నోముల మాధవరెడ్డి, పగిళ్ల సుధాకర్ రెడ్డి , నాయకులు రావుల శేఖర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్లు బాతుక లింగస్వామి , మాజీ కౌన్సిలర్లు గుండు మధు, కర్నాటి రవీందర్, బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాల నరసింహ , నాయకులు కర్నాటి నరసింహ, కందాల సుధాకర్ రెడ్డి, ఆర్ల వెంకటేశం, చిలువేరు శేఖర్, ఆర్ల లింగస్వామి , కంటే రాములు , మునుకుంట్ల బాల చందర్, కొండమడుగు రవి , గోదాసు సీతయ్య, జంగయ్య, చింతకింది కిరణ్, సీత శ్రవణ్ , వాకిటి బాల్ రెడ్డి, నోముల రవీందర్ రెడ్డి , వంగూరు స్వామి , నోముల ఉపేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి