సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ రానే వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1938లోనే ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ కరోనా నేపథ్యంలో రెండేండ్లు నిలిచిపోయింది. ప్రస్తుతం 84వ ప్రదర్శనను గవర్నర్ తమిళిసై, హోం మంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు. ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ నగరవాసులను కనువిందు చేయనున్నది.
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం: గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ముఖ్య అతిథిగా హాజరై నుమాయిష్ ప్రారంభించిన ఆమె ప్రసంగించారు. నుమాయిష్ అంటే ఎంటర్టైన్మెంటే కాదు ఎడ్యుకేషన్ అందించే చక్కటి వేదికన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి వచ్చి ఈ పారిశ్రామిక ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేయడంతో అక్కడి సంప్రదాయాలు, సంస్కృతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా సుమారు 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందడం చాలా గొప్పవిషయమని చెప్పారు. ప్రత్యేకంగా బాలికల విద్య కోసం ఎగ్జిబిషన్ కమిటీ పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో స్టాల్స్ నిర్వాహకులతో పాటు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.
హరీశ్‌రావు డైనమిక్ లీడర్: హోంమంత్రి మహమూద్ అలీ
హరీశ్‌రావు డైనమిక్ లీడర్ అని నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అలాంటి నాయుకుడు నుమాయిష్‌కు అధ్యక్షుడిగా ఉండటం గొప్పవిషయమన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ట్రేడర్స్ అందరూ ఈ ప్రదర్శనకు హాజరు కావడం విశేషమన్నారు. ఎగ్జిబిషన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఒమిక్రాన్‌ను తరిమికొట్టాలంటే మాస్కులు తప్పనిసరని సందర్శకులకు సూచించారు. ‘మాస్కు లేని వారు ఎగ్జిబిషన్‌కు హాజరుకావొద్దని, ఒక వేళ వస్తే గేటు వద్దే ఆపేయాలి’ అని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఉపాధ్యక్షుడు బి.ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్య మార్గం, జాయింట్ సెక్రెటరీ ఎం.చంద్రశేఖర్, ట్రెజరర్ దీరజ్ కుమార్ జైస్వాల్, కమిటీ ప్రతినిధులు ఎన్.వినయ్‌కుమార్, బి.హనుమంత్‌రావు, ఎం.రాజశేఖర్, డాక్టర్ ఉన్నతి పాల్గొన్నారు. మరోవైపు 2019లో జరిగిన అగ్నిప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతిస్టాల్కు ఎంసీబీ లను ఏర్పాటు చేశారు. ఈ సారి ఎగ్జిబిషన్లో 1500లకు పైగా స్టాల్స్ వెలిశాయని నిర్వాహకులు తెలిపారు.