e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News సజావుగా కొనుగోళ్లు

సజావుగా కొనుగోళ్లు

  • గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు
  • రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్‌
  • నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన
  • కేంద్రం, ఎఫ్‌సీఐ తీరుపై గవర్నర్‌కు వినతుల వెల్లువ
  • టీఆర్‌ఎస్‌కేవీ, సీపీఎం, సీపీఐ, రైతుల విజ్ఞప్తులు

నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్‌ 8 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 72శాతం కొనుగోళ్లు పూర్తి చేశారని చెప్పారు. వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయని, ధాన్యం తడవటం వల్ల తిరిగి ఆరబెట్టుకొని అమ్ముకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ తమిళిసై బుధవారం నల్లగొండలో పర్యటించారు. ముందుగా పట్టణంలోని షేర్‌బంగ్లాలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయాన్ని పునఃప్రారంభించారు. ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం శివారులోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతులు మందడి మధుసూదన్‌రెడ్డి, మల్లమ్మతో గవర్నర్‌ మా ట్లాడారు. అక్కడి నుంచి తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గవర్నర్‌ సందర్శించారు. అక్కడ మరో ఇద్దరు రైతులు కే మారయ్య, ఎన్‌ తిరుపతయ్యతో మాట్లాడారు. తర్వాత కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ గన్నీ బ్యాగులు సరిపడా ఉన్నాయా? ఎంత మంది రైతులు ధాన్యం తెచ్చారు? అని ఆరా తీశారు.

- Advertisement -

ఈ సారే ఎక్కువ కేంద్రాలు: గవర్నర్‌
ఆర్జాలబావి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్‌.. నల్లగొండ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గతేడాది 182 కేంద్రాలుంటే ఈ సీజన్‌లో 249 ఏర్పాటు చే శారని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 72 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వివరించారు. రైతులతో ఫ్రెండ్లీగా ఇంటరాక్షన్‌ అవ్వాలని, కొనుగోలు కేంద్రాల గురించి తెలుసుకోవాలని తాను వచ్చానని వెల్లడించారు. రైతులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకోవటం, కొనుగోలు కేంద్రాలపై అవగాహన పెం పొందించుకోవటం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. గవర్నర్‌ వెంట ప్రత్యేక కార్యదర్శి సురేంద్రమోహన్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, అదనపు కలెక్టర్లు వీ చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ, డీఎస్వో వీ వెంకటేశ్వర్లు ఉన్నారు.

కేంద్రం వైఖరితో రైతుల్లో అయోమయం: ఎమ్మెల్యే కంచర్ల
యాసంగిలో ఎంత ధాన్యం కొంటారనేది స్పష్టం చేసేలా రాష్ట్ర రైతాంగం తరఫున కే్ంర దం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. వినతి పత్రం అందజేసిన కంచర్ల.. ‘దేశంలో ధాన్నా న్ని సేకరించాల్సిన భాధ్యత కేంద్రానిది. దీనికోసం కేంద్రం ఎఫ్‌సీఐని ఏర్పాటు చేసింది. ఎఫ్‌సీఐ ద్వారానే రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించాలి. అయినా రైతులకు ఇబ్బందుల్లేకుండా, దళారుల వద్ద మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల నుంచి వ్యవసాయ మార్కెట్లు, పీఏసీఎస్‌లు, మిల్లర్ల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నది. దాని ద్వారా ఉత్పత్తి అయిన ముడి బియ్యం/ఉడికించిన బియ్యాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఎఫ్‌సీఐదే. గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని రవాణా చే యకుండా, వ్యాగన్లను పంపకుండా కక్ష సా ధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఫలితంగా కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికీ కోటా ప్రకటించకపోవటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. వెంటనే కోటా ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.

గవర్నర్‌కు వినతుల వెల్లువ
బియ్యం కొనుగోళ్లలో కేంద్రం, ఎఫ్‌సీఐ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్‌ తమిళిసైకి పలు పార్టీలు, రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. బియ్యం కొనుగోళ్లలో ఎగుమతులు, దిగుమతులను కేంద్రం వేగవంతం చేయాలని, హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం కోరింది. టీఆర్‌
ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షడు గుర్రం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌కు వినతిప త్రం అందజేశారు. బియ్యం కొనుగోళ్లలో కేంద్రం, ఎఫ్‌సీఐ తీరును ఎండగడుతూ సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బృందం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి బృందం, రైతులు గవర్నర్‌కు వినతి పత్రాలు అందజేశారు.

నల్లగొండ శివారులోని ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో గవర్నర్‌ తమిళిసై రైతులతో మాట్లాడారు. ఆ సంభాషణలు ఇవీ..
రైతు మందడి మధుసూదన్‌రెడ్డితో..
గవర్నర్‌ : నీ పేరేంటి?
రైతు :
మందడి మధుసూదన్‌రెడ్డి
గవర్నర్‌ : ఎక్కడి నుంచి వచ్చావ్‌?
రైతు :
పక్కనే ఉన్న చర్లపల్లి నుంచి
గవర్నర్‌ : ఎన్ని బస్తాలు తెచ్చావ్‌?
రైతు :
110 బస్తాలు తెచ్చిన
గవర్నర్‌: ఎన్ని రోజులైంది వడ్లు తెచ్చి? ప్రాబ్లమ్స్‌ ఉన్నాయా?
రైతు:
పది పన్నెండు రోజులైంది. వడ్లు కొ న్నారు. ఈ సారి త్వరగా కాంటా పెట్టారు. మరిప్పుడు వరి వేయాలా వద్దా మేడం.
గవర్నర్‌ : మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉన్నది.
మహిళారైతు మల్లమ్మతో
గవర్నర్‌ : నేను ఎవరో తెలుసా?
మల్లమ్మ:
నాకు పేరు తెల్వదు
గవర్నర్‌ : నా పేరు డాక్టర్‌ తమిళిసై, నేను గవర్నర్‌ను (నవ్వుతూ). మిమ్మల్ని కలువాలని వచ్చా. ఏమైనా సమస్యలున్నాయా?
మల్లమ్మ:
వర్షాలతో వడ్లు తూకం తక్కువ వచ్చాయి
గవర్నర్‌ : ఎన్ని బస్తాల వడ్లు తెచ్చావు?
మల్లమ్మ:
రెండు ఎకరాలు పెట్టినం. 93 బస్తాలు అయినయ్‌.. వర్షాలతో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు వడ్లు పెట్టాల్నా.. వద్దా తెలుస్తలేదు.
గవర్నర్‌ : మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. వస్తా.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement