ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నది. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రకటన అలా వచ్చిందో లేదో గవర్నర్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించలేదని బీజేపీ నేతలు ఒంటికాలి మీద లేచి రాజ్యాంగ ఉల్లంఘన అంటూ పెద్ద పెద్ద పదాలను వల్లిస్తున్నారు.
ఓ దిక్కు గవర్నర్‌ను విధిగా ఆహ్వానించాల్సిన అవసరం లేదని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదని రాజ్యాంగ నిపుణులు చెప్తూనే ఉన్నారు. అయినా గవర్నర్‌ను ప్రభుత్వం అవమానపరుస్తున్నదని బీజేపీ నాయకులు రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు బీజేపీకి గల సంబంధం ఏమిటన్నది చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది.
స్పీకర్, శాసనసభా వ్యవహారాల శాఖ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చూసుకుంటుంది. కానీ గవర్నర్‌ను ఎందుకు పిలువరని బీజేపీ నేతలు ప్రశ్నించడమేంటి? తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండాలన్న ఆనవాయితీ ఉంది. కానీ ఇదే సమయంలో అన్ని రాష్ర్టాల్లో ఆ ఆనవాయితీని పాటించడం లేదు. గతంలోకి వెళ్లి చూస్తే 1970 డిసెంబర్లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. అయితే అనేక అంశాలలో ఎదురుదాడికి దిగాలని, కయ్యం పెట్టుకునేందుకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న బీజేపీ ఇప్పుడు గవర్నర్ అంశాన్ని ముందటేసుకున్నది.
రాష్ర్టాల్లో సుపరిపాలనకు గవర్నర్లు దోహదపడాలని రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారు. కానీ అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నట్లు అనేక సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 1990 దశకం నుంచి గవర్నర్లు రాష్ట్ర పాలనావ్యవస్థలో జోక్యం చేసుకొని అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉన్నవారిని గవర్నర్లుగా నియమించడం, వారిని వాడుకొని, అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కేంద్రానికి అలవాటయిపోయిందని వార్తా కథనాలు కోకొల్లలుగా వచ్చాయి. గవర్నర్ వ్యవస్థ పనితీరుపై పలు కమిషన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. సర్కారియా కమిషన్ గవర్నర్ వ్యవస్థ పనితీరు సరిగా లేదని అభిప్రాయపడింది. ఈ వ్యవస్థలో మార్పులు రావాలని సిఫారసు చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ల వ్యవస్థ మరింత దిగజారిందనే అభిప్రాయాలున్నాయి.
రాజకీయ కురువృద్ధులు, విశ్రాంత ఐపీఎస్, ఐఏఎస్‌లను రాజ్‌భవన్‌లో కూర్చోపెట్టి కేంద్రానికి అనుకూలంగా ఉండే వ్యవస్థగా మార్చే సంస్కృతిని కాంగ్రెస్ తీసుకువచ్చింది. బీజేపీ కూడా కాంగ్రెస్‌నే అనుసరిస్తున్నట్టు అవగతమవుతున్నది. కానీ ప్రధాని మోదీ ఈ వ్యవస్థను మరింత దిగజార్చారు. ఆయన హయాంలో సుమారు 25 మంది వివిధ రాష్ర్టాల గవర్నర్లుగా నియమితులయ్యారు. వీరందరూ రాజకీయ నేపథ్యం ఉన్నవారే. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా, కర్ణాటక రాష్ర్టాల గవర్నర్ల చర్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కర్నాటక గవర్నర్ వ్యవహారం ఆ మధ్య వివాదాస్పదమైంది. ఇప్పుడు తాజాగా రాజ్భవన్లు అవినీతికి నిలయాలని మాజీ గవర్నర్ మల్లిక్ పరోక్షంగా చెప్పడం ఒక సంచలనమైంది.
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన స్టాలిన్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ సర్కార్ పావులు కదుపుతున్నది. పుదుచ్చేరిలో కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించి నారాయణస్వామి ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురిచేసిన బీజేపీ చివరికి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఈ తరహా విధానాన్నే స్టాలిన్‌పై ప్రయోగించేందుకు కేంద్రం వ్యుహం పన్నుతున్నది. రవిని గవర్నర్‌గా నియమించిన కేంద్రం తమిళనాడు ప్రభుత్వంపై కుట్రలకు తెరవెనుక నాటకమాడుతున్నదని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య మొదటినుంచి యుద్ధం నడుస్తున్నది. మమత హాజరైన సమావేశాలకు గవర్నర్ హజరుకాకపోవడం, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు గవర్నర్‌ను మమత సర్కార్ ఆహ్వానించకపోవడం పలు వివాదాలకు దారితీశాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయకర్తలుగా ఉండాల్సిన గవర్నర్లు ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా రాష్ర్టాల పాలనకు అడ్డుపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.
పశ్చిమబెంగాల్లో సీఎం మమతా బెనర్జీ-గవర్నర్ జగదీప్ ధన్కర్, కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే-భగత్‌సింగ్ కోష్యారి, తమిళనాడు సీఎం స్టాలిన్-గవర్నర్ ఆర్.ఎన్. రవిల మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తున్నది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం బాధ్యతారాహిత్యమే.
అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై గవర్నర్ల జోక్యం అవసరం లేదని కేంద్రానికి రాష్ర్టాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా 1983 నాటి సర్కారియా కమిషన్ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలతో సంబంధం లేని మేధావులను గవర్నర్లుగా నియమిస్తే మంచిదనే అభిప్రాయం బలంగా ఉన్నది. మొత్తానికి రాజ్‌భవన్‌లన్నీ కాషాయ గడపలుగా మారి కాషాయ పార్టీ కార్యకలాపాల కు కేంద్ర బిందువైతే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించినట్టవుతుందన్న వాస్తవాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది.
(వ్యాసకర్త: జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకర్త)
ఎనిమిది సార్లు అసెంబ్లీకి, ఐదుసార్లు లోకసభకు ఎన్నికై, ఒకసారి కేంద్రమంత్రిగా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నియమ, నిబంధనలు మరిచిపోతారా? కేవలం బీజేపీ నేతలే ఇక్కడ ఎందుకు తప్పు పడుతున్నారనే విషయాలపై లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉన్నది.
గుంటిపల్లి వెంకట్
94949 41001