హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): యాసంగిలో మినుములు సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తిచేశారు. పండించిన మినుములను మార్క్‌ఫెడ్ ద్వారా పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. శుక్రవారం మార్క్‌ఫెడ్ కేంద్ర కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో, రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగు పెంచడానికి చేపట్టిన చర్యలపై 11 కంపెనీల ప్రతినిధులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మినుములకు కనీస మద్దతు ధర కంటే, మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ఆ ధరకే కొంటామని రైతులకు భరోసా ఇచ్చారు. నాఫెడ్ సైతం మినుములు కొంటామని హామీ ఇచ్చిందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పెసర, వేరుశనగ, ఆవాలు, నువ్వు లు, పొద్దుతిరుగుడు పంటలు సాగుచేయాలని కోరారు. కేటాయించిన జిల్లాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఆయిల్ పామ్ సాగుపై రైతులకు నమ్మకం ఏర్పడుతుందని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. జిల్లాలవారీగా రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లి ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించాలన్నారు. విత్తనం పెట్టే దగ్గరి నుంచి ఆయిల్ ఉత్పత్తి చేసేవరకు అన్ని అంశాలు రైతులకు అర్థమయ్యేలా 30 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీని రూపొందించాలని ఆయిల్ ఫెడ్ ఎండీని ఆదేశించారు.