అచ్చంపేట : విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించడంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో ఐదు రోజుల వృత్యంత శిక్షణ (Extracurricular training) ఇస్తుందని జిల్లా రిసోర్స్‌పర్సన్ నెహ్రూ ప్రసాద్ ( Nehru Prasad) అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను గురువారం సందర్శించి మాట్లాడారు.
ఉపాధ్యాయులకు తెలుగు మౌఖిక భాషాభివృద్ధిపై , గణితంలో చతుర్విధ ప్రక్రియలు, ప్రతి విద్యార్థి సొంతంగా చదవడం, రాయడం కోసం, స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన తదితర అంశాలపై ఉపాధ్యాయులు శిక్షణ పొందారని తెలిపారు.
జూన్ నుంచి ప్రారంభమయ్యే పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరింత అర్థవంతంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరం కృషి చేయాలని కోరారు. ప్రైవేట్ బడుల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్ , మండల రిసోర్స్ పర్సన్లు గోపాల్ , శ్రీలక్ష్మి ,గోవర్ధన్ చెన్నకేశవులు, ఇబ్రహీం విజయ్ ,పద్మ ,విష్ణువర్ధన్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.