నిజామాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, పేరొందిన రైస్‌మిల్లర్‌గా పేరు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.66.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మాయం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడేళ్ల కాలంలో నాలుగు పంట కాలానికి సంబంధించిన ధాన్యాన్ని సీఎంఆర్ పేరిట పౌరసరఫరాల శాఖ నుంచి అప్పనంగా స్వీకరించాడు. ప్రతి సీజన్లో ఒప్పంద పత్రాలు సమర్పించి ధాన్యాన్ని దక్కించుకున్నాడు.
నిర్ణీత గడువులోగా మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వానికి మాత్రం అప్పగించలేదు. ఇలా ఐదు పంట కాలాల్లో మొత్తం పేరుకు పోయిన ధాన్యం విలువ అక్షరాల 2.03 లక్షల క్వింటాళ్ల (20వేల 368 మెట్రిక్ టన్నులు)కు చేరింది. ఈ మొత్తం విలువ రూ.66.12 కోట్లుగా తేలింది. ఇది కేవలం ఒక రైస్‌మిల్లుకు సంబంధించిన బాగోతమే. అడిగే వారు లేరనే ధీమాతో రాజకీయ అండదండలతో చెలరేగిపోయిన ఈ అక్రమార్కుడి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమాజంలో పేరొందిన బడా వ్యాపారిగా చెలామణి అవుతూనే తప్పుడు పనులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు తెరిస్తే దేశం కోసం.. ధర్మం కోసం.. అంటూ నీతులు వల్లించే వ్యక్తులే ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఏమిటంటూ…? ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నేరం చేసిన వ్యక్తికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక ప్రజా ప్రతినిధులతో దగ్గరి సంబంధాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తుల అండదండలతో ఇదంతా నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కీలక ప్రజా ప్రతినిధి పేరును వాడుకుని ఇష్టానుసారంగా అలాట్మెంట్ ప్రక్రియను చేపట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ బకాయిలు పూర్తి చేయని కారణంగా పౌరసరఫరాల సంస్థ కొర్రీలు పెడితే పలువురితో ఒత్తిడి చేయించినట్లు సమాచారం. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అధికారులు చేసేది లేక అలాట్మెంట్ చేశారని తెలుస్తోంది.
రూ.66కోట్ల అవినీతికి పాల్పడిన రైస్ మిల్లర్‌కు జరిగిన కేటాయింపులు గడిచిన నాలుగు సీజన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఉండటం చర్చనీయాంశం అవుతోంది. 2022-23 యాసంగిలో 7355 మెట్రిక్ టన్నులకు బకాయి రూ.16.96కోట్లు, 2024-25 యాసంగిలో 2268మెట్రిక్ టన్నులకు రూ.6.63కోట్లు, 2025-26 వానకాలంలో 6185 మెట్రిక్ టన్నులకు రూ.20.99కోట్లు, 2025-26 యాసంగిలో 7812 మెట్రిక్ టన్నులకు రూ.21.52కోట్లలో బకాయిలు పేరుకు పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్క వ్యక్తికి అప్పనంగా, నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన సీఎంఆర్‌ను సాకుగా చూపి అనేకులకు కేటాయింపులు ఇబ్బడి ముబ్బడిగా జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండు సీజన్లలో బకాయిలు భారీగా పేరుకుపోతే తక్షణం డిఫాల్టర్ జాబితాలో చేర్చాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ ప్రజా పాలనలో జరగలేదు.
జూలై 22న ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్, విజిలెన్స్ బృందాలు స్టాక్ తనిఖీ చేసినప్పుడు 2లక్షల 3వేల 688 క్వింటాళ్లు(20,368 మెట్రిక్ టన్నులు) ధాన్యం కొరత వెలుగు చూసింది. ఈ కొరతకు పెనాల్టీతో కలిపి 66కోట్ల 12లక్షల 55వేల 901 రూపాయలు బకాయిలుగా నిర్ధారించారు. పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బడా వ్యాపారవేత్త, రైస్ మిల్లర్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 316(2), 316(5), 318(4)/318(3) కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 316(1) ప్రకారం ప్రభుత్వ సొత్తును దుర్వినియోగం చేయడం, సొంతానికి వాడుకోవడం నేరంగా పరిగణించబడుతుండగా సెక్షన్ 316(2) ప్రకారం 5సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించే వీలుంది.
సెక్షన్ 316(5) ప్రకారం ప్రభుత్వ సొత్తుకు కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన వాళ్లు తప్పు చేస్తే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలుతో పాటుగా జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 318(4) ప్రకారం చీటింగ్(మోసం) కింద 7ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. అత్యవసర నిత్యావసరాల చట్టం సెక్షన్ 7, తెలంగాణ రైస్ ఆర్డర్ 2015 అనుసరించి సెక్షన్ 3 కింద జారీ చేసిన ఉత్తర్వుల ఉల్లంఘనను పౌరసరఫరాల సంస్థ అధికారులు గుర్తించారు. విచారణలో నమోదైన ఆరోపణలు నిజమని నిరూపితమైతే శిక్ష కఠినంగా ఉంటుంది. బడా వ్యాపారిపై నమోదైన కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జూలై 23న కేసు నమోదైతే ఐదారు రోజులకు బయటి ప్రపంచానికి తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పుష్కలంగా రాజకీయ అండదండలు కలిగిన నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందా? చట్టం చుట్టం అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.