బొల్లారం,జూలై 29: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెయ్యి పడకల టిమ్స్(అల్వాల్) దవాఖాన నిర్మాణాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్, బోర్డు మాజీ సభ్యులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరంలో నలుమూలల శివారు ప్రాంతాల్లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
గాంధీ,ఉస్మానియా వంటి ప్రధాన దవాఖానలపై ఒత్తిడి తగ్గించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికే 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలలోనే మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి 90 శాతం పనులు పూర్తయ్యాయని ప్రకటించారని గుర్తు చేశారు. అయినా ఇప్పటికీ ఆస్పత్రిని ప్రారంభించలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తానంటూ చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ ఆస్పత్రి ప్రారంభాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల వరకు ఈ ప్రాజెక్టును నిలిపివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.
కమీషన్ల కోసమే స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాడని క్రిషాంక్ ఆరోపించారు.తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులు చేపట్టి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మాట తప్పారని,అదే విధంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఆటంకాలు సృష్టించాడని, ఇప్పుడు టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను కూడా నిలిపివేసుందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదుతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల అనుమతి తీసుకొని మాత్రమే ఆస్పత్రిని సందర్శించాలని చెప్పడం సరికాదని క్రిషాంక్ మండిపడ్డారు. ప్రజా ధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఆస్పత్రిని సందర్శించేందుకు లోపలికి వెళ్లిన సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు.పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్, మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యు డు లోక్‌నాథ్, శ్యామ్‌కుమార్, రవి కుమార్, కిరణ్, శ్రీహారి, సోమ య్య, యాసిన్, గంగారామ్, శర్వీన్, నారాయణ, చంద్రశేఖర్, శత్రు, మోనీ, రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు.