సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): పోలీసులు ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్‌ను అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ అన్నారు. బుధవారం కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ లా అండ్ ఆర్డర్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను సిపి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రజలకు అక్కడి అధికారులు అందిస్తున్న సేవలు, ట్రాఫిక్ నిర్వహణ విధానం, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సీపీ రమేశ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు జవాబుదారిగా ఉండాలన్నారు.
రద్దీ ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్ నిర్వహణ చేపట్టి, వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్లలో మౌలిక వసతులను సక్రమంగా నిర్వహిస్తూ, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిషారంలో వేగం, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు.
విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యం, మర్యాదపూర్వక ప్రవర్తన, ప్రజా సేవా దృక్పథానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా వాహనదారులు, ప్రజలతో మర్యాదగా, సంయమనంతో వ్యవహరించాలన్నారు. అనంతరం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్‌ను సందర్శించిన సీపీ, ట్రాఫిక్ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ విధానాన్ని సమీక్షించారు. ఈ తనిఖీలలో సైబరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) సన్ ప్రీత్ సింగ్, ట్రాఫిక్- 1 డీసీపీ రవికుమార్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.