ఎల్లారెడ్డి, ఆగస్టు 19 : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందడంలేదు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు అమలుకావడంలేదు. విద్యార్థులకు ఎనిమిది రకాల పండ్లను అందించాల్సి ఉండగా, కొన్ని గురుకుల విద్యాలయాల్లో అరటి పండు మాత్రమే ఇచ్చిన చేతులు దులుపు కొంటున్నారు. గురుకులాల్లో పర్యవేక్షణ కొరవడడం, వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్ల చేతి వాటం కారణంగా విద్యార్థులకు సరైన పోషకాహారం అందడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్లారెడ్డి పట్టణంలో మూడు గురుకుల పాఠశాలలతో పాటు ఒక కస్తూర్బా, ఆదర్శ పాఠశాలకు వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారు 19 వందల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికి ఒకే రకమైన భోజన సదుపాయాలు ఉన్నప్పటికి, వాటి అమలులో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రతిరోజూ పండ్లు పంపిణీ చేయాలనే నిబంధనల ఉండగా, సంబంధిత కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. పండ్ల పంపిణీకి సంబంధించి తక్కువ కోటేషన్ వేసి టెండర్‌ను దక్కించుకున్నాడు. పండ్ల సరఫరాలో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల పొట్టకొడుతున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన స్థానిక అధికారులు ఉదాసీనంగా ఉండడంతో వేలాది మంది విద్యార్థుల డబ్బులను కొందరు స్వాహా చేస్తున్నట్లు సమాచారం.
విద్యార్థులకు పండ్ల సరఫరా చేసేందుకు టెండర్లు వేసే కాంట్రాక్టర్లు అతి తక్కువ ధరకు పండ్లు అందిస్తామని తమ దరఖాస్తుల్లో పేర్కొంటారు. ఆర్డర్ దక్కించుకున్న తర్వాత వారి ఇష్టానుసారంగా పంపిణీ చేయడంలో ఆరితేరుతున్నారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలకు పండ్లు పంపిణీ చేసే కాంట్రాక్టర్ వేసిన పండ్ల ధరలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఆయన కిలో జామ పండ్లకు రూ.10, కిలో పుచ్చకాయకు రూ.16 , కిలో సంత్రాలకు రూ.10, కిలో ఆపిల్ పండ్లకు రూ.5, కిలో ఖర్బూజాకు రూ.10, కిలో ద్రాక్షకు రూ.15, కిలో బొప్పాయి పండుకు ఎనిమిది రూపాయలు కోట్ చేశారు. వీటితో పాటు డజను అరటి పండ్లకు మాత్రం 35 రూపాయలు కోట్ చేసి టెండర్ దక్కించుకున్నారు. కానీ ఆయన మార్కెట్లో కేవలం 20 నుంచి 30 రూపాయలకు లభించే అరటి పండును మాత్రమే విద్యార్థులకు నిత్యం పంపిణీ చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇంతజరుగుతున్నా ఆయా గురుకుల పాఠశాలల ఇన్చార్జీలు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
విద్యార్థులకు సీజన్ ఆధారంగా అరటి, జామ, పుచ్చ, సంత్రాలు, కర్బూజ, ఆపిల్, అంగూరు, బొప్పాయి పండ్లు పంపిణీ చేస్తామని కాంట్రాక్టర్లు తమ టెండర్లో పేర్కొంటున్నారు. కానీ కేవలం అరటి పండుతోనే ఏడాది గడిపేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు అరటి పండు తప్ప మరే పండు ఇవ్వకపోవడం గమనార్హం. కొన్ని గురుకుల పాఠశాలల్లో గుడ్డు ఇచ్చిన రోజు అరటి పండును సైతం ఎగ్గొడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అరటి పండును మాత్రమే ఇస్తున్నారు. జామ, ఇతర పండులాంటివి ఇప్పటి వరకు ఇవ్వనేలేదు. గుడ్డు పెట్టినప్పుడు కొన్నిసార్లు పండ్లు ఇవ్వడంలేదు. ఇతర రకాల పండ్లు ఇస్తారనే విషయం మాకు తెలియదు.
-నవనాథ్, గోద్మేగావ్, పదో తరగతి, ఎస్సీ గురుకుల పాఠశాల, ఎల్లారెడ్డి.
విద్యార్థులకు ప్రతిరోజూ పండ్లు ఇవ్వాలనే నిబంధన ఉన్నది. ఎలాంటి పండ్లు ఇస్తున్నారనే విషయాన్ని కనుక్కుంటాం. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికీ పండ్లు పంపిణీ చేయాలని కాంట్రాక్టర్‌ను కోరుతాం. నిబంధనలు పాటించక పోతే అతడిపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం.
-నాగేశ్వర్ రావు, ప్రిన్సిపాల్, ఎస్సీ గురుకుల పాఠశాల, ఎల్లారెడ్డి.