హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డిపై కొండా మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీశారని, పూర్తి నివేదిక ఇవ్వాలని టీపీసీసీని ఆదేశించినట్టు సమాచారం.
సుస్మితా పటేల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, ఖండిస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడుతూ తెలిపారు. సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి సమాచారాన్ని తెప్పించుకొన్న తర్వాత సుస్మితపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇటీవల సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే వారికి నోటీసులిచ్చి, వివరణ కోరినట్టు మల్లు రవి తెలిపారు.