న్యూఢిల్లీ : రూ.20 లంచం ఆరోపణకు సంబంధించిన న్యాయ పోరాటం మూడు దశాబ్దాల తర్వాత ముగిసింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. లంచం డిమాండ్ చేశారని రుజువు కాకుండా కేవలం రూ.20 స్వాధీనం చేసుకున్నారన్న కారణంపై శిక్షను ఖరారు చేయలేమని పేర్కొంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఒక క్లర్క్‌ను, ఒక ప్యూన్‌ను నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసు 1996 ఫిబ్రవరి నాటిది. విద్యాపరమైన రాయితీలు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ఒక విద్యార్థి ఆనంద్ జిల్లాలోని బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఆ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయించడానికి క్లర్క్ రూ.120 డిమాండ్ చేశారని, అందులో రూ.100 తన కోసం, రూ.20 ప్యూన్ కోసం అని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆ తర్వాత ఆ విద్యార్థి ఏసీబీకు ఫిర్యాదు చేశాడు.
దాంతో వారు ఒక వల పన్ని రూ.120 విలువైన మార్క్ చేసిన నోట్లతో ఆ విద్యార్థిని పంపారు. ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాత ఆ విద్యార్థి ప్యూన్‌కు రూ.20 ఇచ్చాడు. దాడి చేసిన బృందం ప్యూన్ వద్ద నోటును స్వాధీనం చేసుకుంది. కానీ క్లర్క్ వద్ద మాత్రం ఆ రూ.100 లభించలేదు. లంచం కోరారన్న ఆరోపణకు సంబంధించి ఫిర్యాదుదారైన విద్యార్థి వేరొక సందర్భంలో భిన్నమైన వాంగ్మూలం ఇచ్చాడని పేర్కొంటూ ప్రాసిక్యూషన్ వాదనలోని వైరుధ్యాలను కూడా కోర్టు గుర్తించింది. చివరకు దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను రద్దు చేసి ఆ ఇద్దరు నిందితులను నిర్దోషులుగా సుప్రీంకోర్టు విడుదల చేసింది.