సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు నిరుపేదలకు ఆపన్నహస్తంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు కార్పొరేట్‌కే పరిమితమైన డయాలసిస్ సేవలు.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేదలకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సర్కార్ దవాఖానల పరిధిలోని డయాలసిస్ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో గ్రేటర్‌లోనే ప్రతి ఏటా సుమారు 30వేల నుంచి 40వేల మంది రోగులు కిడ్నీ సమస్యలతో దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు నగరంలో ప్రతి సంవత్సరం సుమారు 10వేల నుంచి 12వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నట్లు నెఫ్రాలజీ వైద్యనిపుణులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి 10మందిలో ఒకరికి కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వైద్య నివేదికల ద్వారా తెలుస్తోంది. బాధితుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని నాటి బీఆర్ఎస్ సర్కార్ అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉస్మానియాలో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని ఆధునీకరించడంతో నేడు వేల మంది నిరుపేద కిడ్నీ రోగులు పైసా ఖర్చులేకుండా ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు.
సాధారణంగా ఒక్కసారి డయాలసిస్ చేయించాలంటే కార్పొరేట్ దవాఖానలో రూ.3వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతుంది. రోగి ఆరోగ్యపరిస్థితి ఆధారంగా వారానికి రెండు సార్లు లేదా మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక రోగికి ప్రతి నెల సుమారు రూ.12వేల నుంచి రూ.40వేల వరకు ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా నిరుపేద రోగులు ఈ ఆర్థిక భారం భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకునేవారు. మరికొంతమంది ఆర్థిక స్థోమత లేక సమయానికి డయాలసిస్ చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు గతంలో చాలా ఉండేవి. దీనిని దృష్టిలో పెట్టుకుని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద కిడ్నీ రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుని 2017లో మలక్‌పేట ఏరియా హాస్పిటల్, 2018లో గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ పర్యవేక్షణలో డి-మేడ్-సెంటర్ల పేరుతో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఉస్మానియాలో ప్రతిరోజు 80-100 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఉస్మానియాలో 220 మంది డయాలసిస్ రోగులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో రోగికి వారంలో రెండు మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతినెల సుమారు 3000 మందికి డయాలసిస్ చేస్తున్నాం. అంతే కాకుండా టెలీమెడిసిన్ ద్వారా ఉస్మానియా నుంచి ఇతర జిల్లాల్లోని 30కేంద్రాలకు ఆన్లైన్ సేవలందిస్తున్నాం. జిల్లాలోని రోగులు వారం రెండుమూడు సార్లు ఉస్మానియా లేదా ఇతర దవాఖానలకు రావాలంటే అన్నిరకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టలో పెట్టుకుని ప్రభుత్వం టెలీమెడిసిన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా జిల్లాలో శిక్షణ పొందిన వైద్యులకు ఉస్మానియా నుంచి మార్గదర్శకాలు, సూచనలు జారీ చేస్తూ రోగులకు డయాలసిస్ సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం.
ఉస్మానియాలో ఇప్పటి వరకు మొత్తం 800 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. ఒక ప్రభుత్వ దవాఖానలో ఇంత పెద్ద మొత్తంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడా లేదు. సాధారణంగా ప్రభుత్వ దవాఖానల్లో డోనర్స్ దొరకరు. అంటే అవయవాలను దానం చేయడానికి ఎక్కువగా ముందుకురారు. కిడ్నీ అవసరం ఉన్న వారు చాలామంది నిరీక్షణలో ఉన్నారు. డోనర్స్ ముందుకు వస్తే.. ఆరోగ్యశ్రీ ద్వారా పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రతినెల ఒకటి లేదా రెండు ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తున్నాం. డోనర్స్ సంఖ్య పెరిగితే ట్రాన్స్‌ప్లాంట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రజల్లో అవయవదానంపై మరింత అవగాహన పెరగాల్సి ఉంది.