Liquor Rates | హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ ధరల పెంపుపై ఇంకా కసరత్తు చేస్తున్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీలు కోరిన మేరకు ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం ఎప్పుడో రంగం సిద్ధం చేసిందని, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తప్పించుకునేలా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్టు మద్యం వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. మద్యం ధరలు పెంచాలని కంపెనీల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 18న తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. అదేనెల 26న సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను చూసింది. 91 కంపెనీలు మద్యం సరఫరాకు ముందుకు వచ్చాయని, బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ మద్యం సహా మొత్తం 1032 బ్రాండ్లుకు ధర కోట్ చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్ లోకల్ కంపెనీలు కూడా ఉన్నాయి.
ఓ పెద్ద కంపెనీతో కలిసి పెద్దల నాటకం!
మద్యం మార్కెట్లో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఓ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30 శాతం అదనపు ధర చెల్లించాలని కోట్ చేసిందని, ఈ కంపెనీ డిమాండ్‌నే ఇతర కంపెనీలు అనుసరించాయని తెలుస్తున్నది. ధర పెంచాలని మద్యం కంపెనీలు కోరడం, ప్రభుత్వం తిరస్కరించటం తరచుగా జరుగుతూ ఉంటుంది. 2023లో కూడా మద్యం కంపెనీలు బేసిక్ ధర పెంచాలని కోరగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించింది. కానీ ఇప్పుడు మద్యం ధరలు పెంచడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మెగ్గుచూపున్నట్టు సమాచారం. కానీ ప్రజల నుంచి వ్యతిరేకతను తప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కొత్త ఎత్తుగడ వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరల పెంపునకు ప్రభుత్వ పెద్దలు ముందుగా తిరస్కరించారని, ఓ ప్రముఖ కంపెనీ సరఫరా నిలిపివేస్తున్నట్టు ప్రకటించినందున, తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందనేలా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్టు మద్యం వ్యాపారవర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం హడావుడి మీటింగ్ ఎందుకు?
ఒప్పందం ఉల్లంఘిస్తూ సరఫరా నిలిపివేసే ఏదైనా మద్యం కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని న్యాయనిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం సదరు బీర్ల కంపెనీపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీని బూచిగా చూపుతూ ప్రజలపై భారం మోపడానికే పెద్దలు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నిర్వహించిన ఎక్సైజ్‌శాఖ సమావేశం కూడా ప్రణాళికలో భాగంగానే జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.