వనపర్తి : పది లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వ సాయం అందించింది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి , సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని మంత్రి తెలిపారు. రైతుబంధు పథకం ఎన్నికల కోసం అన్నారు.
కానీ, ఇప్పటికి ఎనిమిది విడతలలో రూ.50,400 కోట్లు రైతుల ఖాతాలలో వేశామని మంత్రి గుర్తు చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 4 లక్షల మందికి రూ.2 వేల కోట్లు అందించిన ఏకైక సర్కారు కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు.పేదలు ఇబ్బందులు పడొద్దనే వివిధ పథకాలకు కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.