హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మేడారం జాతరలో గొట్లుగోత్రాల చిహ్నాలపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనం సంచలనం సృష్టిస్తున్నది. గద్దెల వద్ద స్తంభాలపై స్వస్తిక్, తిరునామాలు, శంఖుచక్రాలు, శివలింగం ఆకృతులను చెక్కడంపై ఆదివాసీలతోపాటు మేడారం జాతరతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. అసలు జాతరకు వీటికి ఏం సంబంధమున్నదని, ఇదంతా ఆదివాసీ జాతర మూలాలను దెబ్బతీయడేమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ కథనంపై అధికార పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ’కు హెచ్చరికలు జారీచేస్తూ ప్రకటనలు విడుదల చేశారు. కాగా, తాళపత్రాలు, పగిడెల ఆధారంగా స్తంభాలపై ఈ గుర్తులు వేశామని ఆర్కిటెక్ట్ అరుణ్ తెలిపారు. శివలింగం అనేది వేములవాడకు గుర్తని, భక్తులు ముందు వేములవాడకు వెళ్లొచ్చాకే సమ్మక్క జాతరకు వస్తారని, ఇక్కడ ద్రవిడుల సంస్కృతి కూడా ఉన్నదని చెప్పారు. ఈ వాదనతో పరిశోధకులు విభేదిస్తున్నారు. వేములవాడకు వెళ్లేవారంతా గిరిజనేతరులని, ఆదివాసీలెవరూ వేములవాడకు వెళ్లొచ్చి సమ్మక్క జాతర కార్యక్రమాలను ప్రారంభించే సంప్రదాయం లేదని స్పష్టం చేస్తున్నారు.
వాస్తవానికి మేడారం ఏ ఒక్కరి సొత్తు కాదు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి ప్రకృతితో మమేకమై అమ్మలను కొలిచే సంబురం. ఈ జాతరలో ఆదివాసీలతోపాటు గిరిజనులు, గిరిజనేతరులు పాల్గొని సమ్మక్క, సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకుంటారు. సమ్మక్క జాతరపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. ఈ జాతర మూలాలను తెలుగు యూనివర్సిటీ పూర్తిగా రికార్డు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలను నిక్షిప్తం చేసింది. వరంగల్‌లోని జానపద గిరిజన విజ్ఞానపీఠం సిబ్బంది ఈ జాతరకు సంబంధించిన అణువణువూ పరిశోధించారు. నాటి నుంచి ఇప్పటివరకు జాతరలో ప్రతి ఘట్టాన్ని పదిలపరచడంతోపాటు పాత తరానికి సంబంధించిన వారితో మాట్లాడి పరిశోధనాత్మక పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఆ పరిశోధనల్లో ఎక్కడా గోత్రాలకు సంబంధించిన పగిడెల్లో తిరునామాలు, స్వస్తిక్ ప్రస్తావన లేదని యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. ఇప్పటివరకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పటాల ఆధారంగానే వారి వంశచరిత్రలు, వారిపుట్టుపూర్వోత్తరాలు వెలుగుచూశాయని, ఆ పటాల్లో తిరునామాల్లాంటి చిహ్నాలేవీ కనిపించవని చెప్తున్నారు.
ఆదివాసీ కోయ జాతుల చరిత్రకు డాలుగుడ్డే (దేవరగుడ్డ) పూర్తి ఆధారమని ఆదివాసీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వారి సామాజిక నిర్మాణం, గొట్లు గోత్రాల వ్యవస్థ, ఆయా గోత్రాల మూలపురుషులు, వారి భార్యలు, కొడుకులు ఉపయోగించిన వస్తువులు, జంతువులు, వృక్షాలు, పక్షులు, సరస్సులు, పాము, ఆకాశం, కోయరాజులు, భార్యలు, వారికి సహకరించిన వ్యక్తులు, భూమిపుట్టుక, పరిణామక్రమాల బొమ్మలు దేవరగుడ్డలపై ఉంటాయి. ఆ బొమ్మలను రంగురంగులతో తయారుచేసి ఖద్దరు వస్త్రంపై అద్దుతారు. ప్రతి బొమ్మకూ ఒక చరిత్ర ఉంటుంది. కోయరాజుల గోత్రాలను బట్టి వాటి సంఖ్య మారుతుందని, ఆ పగిడెలను ఆధారంగా చేసుకుని కోయవారి చరిత్రలను డోలివారు చెప్తారని పరిశోధకులు తెలిపారు. తమ పరిశోధనలో ఎక్కడా తిరునామాలు, స్వస్తిక్ కనిపించలేదని స్పష్టం చేశారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులకు తిరునామాలతో సంబంధం ఉంటే తమ పరిశోధనల్లో లేదా ఆదివాసీ పెద్దలతో జరిపిన ఇంటర్వ్యూలోనైనా వెలుగులోకి వచ్చేదని పేర్కొన్నారు.

తెలుగు యూనివర్సిటీ తర్వాత జరిగిన పరిశోధనలు, పత్రికావ్యాసంగాల్లోనూ గుర్తుల గురించి ఉన్నప్పటికీ ఎక్కడా నామాలు, శంఖుచక్రాలు, తాళపత్రాల ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రాచ్యలిఖిత భాండాగారం తరఫున చేసిన అన్వేషణలోనూ మేడారానికి సంబంధించిన తాళపత్రాలేవీ దొరుకలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. కానీ, ఇటీవల కొందరు ఓ సంస్థను ఏర్పాటు చేసి తాళపత్రాలు దొరికాయని, చర్ల దగ్గర దొరికిన ఆ పత్రాలకు నాగబంధం వేసి ఉన్నదని చెప్పారు. దీంతో ఆ తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ప్రపంచానికి ఎందుకు చూపించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరుగునపడిన చరిత్రను వెలికితీసే క్రమంలో అసలు చరిత్రను వక్రీకరించడం తరతరాల సంస్కృతిని విచ్ఛిన్నం చేసినట్టే అవుతుందని ఆదివాసీ పెద్దలు, పరిశోధకులు, చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేడారం జాతర ఆదివాసీల సంప్రదాయ వ్యవహారాలకు ప్రతీక. జాతరకు వచ్చే భక్తుల అచంచలమైన భక్తి విశ్వాసాలకు వేదిక. ప్రకృతిని పూజిస్త్తూ ఆ అమ్మల రూపంలో కొలిచే మూణ్ణాళ్ల ముచ్చట. తల్లుల దర్శనానికి తరలివచ్చే కోట్లాదిమంది నమ్ముతున్న వేడుక. అటువంటి సంబరంపై ఆధునికత పేరుతో జరుగుతున్న దాడిని, ఆదివాసీల మూలాలను చెరిపివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’పై అధికారపార్టీ నేతలు అక్కసు ప్రదర్శిస్తున్నారు. వారి అధికార బలాన్ని చూపించుకోవడానికి ప్రకటనల రూపంలో ‘నమస్తే తెలంగాణ’పై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ‘నమస్తే తెలంగాణ’ కార్యాలయాలపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ‘నమస్తే తెలంగాణ’ తేల్చిచెప్తున్నది. పలువురు ఆదివాసీ పెద్దలు సైతం ‘నమస్తే తెలంగాణ’లో కథనం చూసి ఉదయం నుంచే మీరు కరెక్ట్‌గా రాశారంటూ అభినందించారు. ‘మేం చెప్పకపోయినా మీరు చెప్పారు మాకు అండగా నిలిచారు’ అంటూ అభినందించారు.
సమ్మక్క, సారలమ్మలకు కల్యాణోత్సవంలో నిర్వహించే జాతరకు వేములవాడతో ఎలాంటి సంబంధం లేదు. గిరిజనేతరులకు పట్నాలు వేయడం, శావ తీయడం వంటివి ఉంటాయి. వారు జాతరకు వచ్చే ముందు వేములవాడకు వెళ్లొస్తారు. డోలికోయ మౌఖిక సాహిత్యంలో శివపార్వతుల సంతతికి సంబంధించినట్టు చెప్పినప్పటికీ సాహిత్యంలో తప్ప వారికి సంబంధించిన బొమ్మలు ఎక్కడా కనిపించవు. గోత్రాలు, పడిగెల మీద నేనూ పరిశోధన చేశా. ఆదివాసీలకు సంబంధించిన కొన్ని చిహ్నాలు సింధు నాగరికతలో బయటపడ్డవాటితో సారూప్యత కలిగి ఉండవచ్చు. కానీ, ఆదివాసీ చరిత్రను సింధు నాగరికతకు అనుబంధమైనదిగా చెప్పడం దారుణం. అసలు ఈ చిహ్నాల విషయమై వారు కోయ పెద్దలతో కానీ, ఆదివాసీ పరిశోధకులతోకానీ సంప్రదించి, అభిప్రాయ సేకరణ చేయలేదు. నా పరిశోధనలో ఎక్కడా తిరునామాలు, శంఖుచక్రాలు కనిపించలేదు. కోయ చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు చెప్పే డాలుగుడ్డల్లో చిహ్నాలు లేకుండా తాము అనుకుని స్తంభాలపై వేశారు. ఆదివాసీల మూలదైవాలు సమ్మక్క, సారలమ్మల అంశంలో కొత్త చిహ్నాలతో మూలాలే కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది.
సమ్మక్క జాతరలో దేవతల డాలుగుడ్డను తయారుచేసేది మేమే. కోయ ఇలవేల్పులకు సంబంధించిన 260 పడిగెలన్నీ మేమే చేస్తాం. వీటిలో ఎక్కడా తిరునామాలు, స్వస్తిక్ చిహ్నాలు ఉండవు. మా నాలుగు తరాల కంటే ముందునుంచి మేము వీటిని తయారు చేస్తున్నాం. మాతాత డోలి కళాకారుడు రామచంద్రయ్య చెప్పినట్టు వడ్డెలు మా దగ్గరికి వచ్చి అన్ని వివరాలు, అర్తిలు పూర్తిగా చెప్పిన తర్వాతే పటాలు తయారు చేస్తాం. నాలుగు రాష్ర్టాల నుంచి మా దగ్గరకే వచ్చి పడిగెలు తయారు చేయించుకుంటారు. మా ఇలవేల్పులకు సంబంధించిన పుస్తకం ఒకటి తయారు చేశాను. అందులో వంద ఫోటోలున్నాయి. వాటిలో పడిగెలకు సంబంధించిన చిత్రాల్లో ఎక్కడా ఈ గుర్తులు లేవు. పగిడిద్దరాజుకు సంబందించిన పడిగెలు మా దగ్గర ఉన్నాయి. రామచంద్రయ్య కథలు చెప్పేటప్పుడు వెనుక కూర్చుని రాసుకున్న వ్యక్తులు ఇప్పుడు లీడర్లయి ఏదేదో చేస్తున్నారు. పడిగెలు, చిహ్నాల విషయంలో పెద్దలను సంప్రదించి, వాటిని తయారుచేస్తే బాగుంటుంది.
మేడారం జాతరలో స్తంభాలపై స్వస్తిక్‌లు, తిరునామాలు పెట్టడం తప్పు. సమ్మక్క జాతరకు సంబంధించి ఎక్కడా తాళపత్రాలు దొరకలేదు. అయినప్పటికీ అవి ఉన్నట్టు ఇప్పుడు కొందరు చెప్తున్నందున అసలు అవి ఎక్కడ ఉన్నాయో చూపించమని అడుగుతున్నాం. ఆదివాసీలకు తాళపత్రాలు ఉన్నాయనే మాట అవాస్తవం. కొందరు ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నాదగ్గరికి వచ్చి డిజైన్స్ కావాలంటే ఆదివాసీల మీద ప్రేమతో ఇచ్చిన. మళ్లీ అప్రూవల్ కోసం వస్తామని వారు అంటే నేను వద్దని చెప్పిన. ఆదివాసీల చిహ్నాలు వేరే ఉంటాయి. వాటిని వేయడం లేదు. పరిశోధనలంటూ చరిత్రను మరుగునపడేస్తూ కొత్తకొత్త భావనలు తెరపైకి తేవడం బాధాకరం. మేడారం జాతర విషయంలో ముఖ్యంగా ఆదివాసీల మూలాల విషయంలో ఇటువంటి చిహ్నాలను తీసుకొచ్చి ఏం చేస్తారోనన్న ఆవేదన కలుగుతున్నది.