ముంబై, డిసెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధులు వెనక్కి పోతుండటం, దేశీయంగా నెలకొన్న పలు పరిస్థితుల కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా వారాంతపు ట్రేడింగ్‌లోనూ సూచీలు భారీగా పతనం చెందాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో 85 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367.25 పాయింట్లు కోల్పోయి 85,041.45 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 99.80 పాయింట్లు నష్టపోయి 26,042.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీ వరుసగా రెండోరోజు పతనమైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం పతనంపై ఆజ్యంపోసినట్టు అయిందని ఎన్రిచ్ మనీ సీఈవో పోన్మది ఆర్ తెలిపారు. ఐటీ, రియల్ ఎస్టేట్, ఎనర్జీ రంగ షేర్లతోపాటు పలు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి.