గజ్వేల్, డిసెంబర్ 6 : గజ్వేల్ ప్రాంతంలో నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేమార్గం నిర్మాణంలో భాగంగా సోమవారం నిర్మాణానికి అవసరమైన సామగ్రితో గజ్వేల్‌కు గూడ్స్ రైలు చేరుకుంది. అధికారులు ఇప్పటికే రెండు లైన్ల ప్యాసింజ్ రైలు మార్గంతో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా, సరుకుల రవాణా కోసం గూడ్స్ రైలు ప్లాట్‌ఫాంను కూడా ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అలాగే గజ్వేల్ నుంచి సిద్దిపేట వైపు రైల్వేలైన్ నిర్మాణం కొనసాగుతుండగా, వారం పది రోజులుగా గూడ్స్ రైలు ద్వారా ట్రయల్ వేయడంతో పాటు రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని గూడ్స్ రైలులోనే తీసుకువస్తూ పరీక్షిస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం కూడా గజ్వేల్‌కు గూడ్స్ రైలు సామగ్రితో రాగా, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ దృశ్యాలను స్థానిక ప్రజలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.