ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 1: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీకి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. తార్నాకలోని ఆర్టీసీ దవాఖానను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది కార్మికులకు మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ దవాఖానలో కొత్తగా నిర్మించిన ఐసీయూ, మూడు ఎమర్జెన్సీ గదులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు తనకు తెలుసని, తన సొంత బావ కూడా ఆర్టీసీ డ్రైవరేనని తెలిపారు. ఆర్టీసీ దవాఖాన నుంచి ప్రస్తుతం రోగులను వేరే దవాఖానలకు పంపుతుండటంతో సంస్థపై ఏటా రూ.40 కోట్లు భారం పడుతున్నదని, ఈ దవాఖానలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఆ భారం తప్పుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి సకల సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానగా తీర్చిదిద్దుతామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం దాతల సహకారం కూడా తీసుకొంటున్నామని చెప్పారు. త్వరలోక్యాథ్ల్యాబ్ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ దవాఖానకు రోజూ 1,200 మందివరకు వైద్యం కోసం వస్తుంటారని తెలిపారు. ఐసీయూను దాతల సహకారంతోనే నిర్మించినట్టు చెప్పారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనావల్ల చాలామంది ఆర్టీసీని వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తుండటంతో ట్రాఫిక్ జామ్లతోపాటు రోజువారీ ఖర్చులు కూడా పెరిగిపోయాయని తెలిపారు. ప్రజలంతా మళ్లీ ఆర్టీసీలో ప్రయాణిస్తే రోడ్లపై వ్యయప్రయాసలు తప్పుతాయని, ఆర్టీసీ లాభాల బాట పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.