హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో వందలాది కోట్లు ఖర్చు చేసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగి డి సునీత విమర్శించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం దాతల సాయం కోరుతూ దేవస్థానం ఈవో భవానీశంకర్ విడుదల చేసిన కరపత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఈవోపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ కరపత్రం దేవస్థాన పాలకమండలికే అవమానకరమని పేర్కొన్నారు. ఆలయ పనులకు నిధులు కేటాయించేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్న విషయం దీంతో తేటతెల్లమైందని విమర్శించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈవో విడుదల చేసిన కరపత్రాన్ని ఆమె మీడియాకు చూపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సుమారు రూ.1,300 కోట్లతో అభివృద్ధి చేసి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని ఆమె గుర్తుచేశారు. ఆలయ నిర్మాణ సమయంలో దాతల సాయం కోరలేదని, ఆల యం పూర్తయిన అనంతరం బంగారు తాపడం కోసమే దాతల నుంచి విరాళాలు కోరినట్టు తెలిపారు. కానీ, ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయంలో 16 రకాల పనులకు దాతలు కావాలని కరపత్రం వేయడమేందని ప్రశ్నించారు.
గతంలో చేపట్టిన పనులకూ దాతల నుంచి విరాళాలు కోరడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో దీక్షాపరుల కోసం మంచి భవనాన్ని నిర్మించారని, దానికి మళ్లీ దాతల నుంచి రూ.43 కోట్ల సాయం ఎలా కోరుతారని నిలదీశారు. వేద పాఠశాల నిర్మాణానికి రూ.43 కోట్లతో 2023లో కేసీఆర్ శంకుస్థాపన చేశారని, దాని నిర్మాణానికి గత మే నెలలో సీఎం రేవంత్రెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఆ పనులకు కూడా దాతల నుంచి విరాళాలు కోరడం వెనుక ఉన్న ఉద్దేశమేందని నిలదీశారు.
‘ప్రభుత్వం వద్ద నిధుల్లేకుండానే సీఎం శంకుస్థాపన చేశారా? శంకుస్థాపన చేసిన పనులకూ దాతల సాయం కోరడం సీఎంకే అవమానకరం కాదా?’ అని పేర్కొన్నారు. నిత్యకల్యాణ మండప నిర్మాణానికి పాలకమండలి చైర్మన్ తన సొంత నిధుల నుంచి రూ.9 కోట్లు ఇస్తానని ప్రకటించి సమావేశంలో తీర్మానం కూడా చేశారని తెలిపారు. అయినా, అదే పనికి దాతల నుంచి విరాళాలు కోరడమేందని విమర్శించారు. ముఖద్వారాల నిర్మాణానికీ చైర్మన్ రూ.4 కోట్లు ఇస్తానని ప్రకటించారని, ఆ మొత్తానికీ దాతల సాయం కోరడం సరికాదని పేర్కొన్నారు.
గతంలో నిర్వహించిన అందాల పోటీలకు యాదాద్రి ఆలయ నిధులను ఖర్చు చేశారని గొంగిడి సునీత ఆరోపించారు. ఇప్పుడేమో ఆలయ అభివృద్ధి పనులకు దాతల సాయం కోరడమేందని ప్రశ్నించారు. దాతల సాయం పేరుతో అవకతవకలకు అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మానవ హకుల కమిషన్ను ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నేతలు వెంకటయ్య, మహేందర్, అనూరాధ, రామిరెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.