బెంగళూరు, మే 22 : బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం అంగీకరించారు. అయితే అది ఆయన వివాహ బహుమతిగా రన్యారావుకు అందజేసిన మొత్తమని వివరించారు. రన్యారావు స్మగ్లింగ్ కేసులో సంబంధాలు ఉండటమే కాక, ఆమెతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణతలో హోం మంత్రికి చెందిన విద్యా సంస్థలపై ఈడీ బుధవారం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
అందులో రన్యారావుతో నగదు లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. అయితే తన మంత్రిని సమర్థించుకునే ప్రయత్నం డీకే చేశారు. ‘ఒక వివాహం జరిగింది ప్రజలకు బహుమతిగా మేము 10 వేలు, 5 లేదా 10 లక్షలు ఇస్తాం. ఆమె ఏం చేసినా అది తప్పే. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను కేవలం పరమేశ్వర విషమమే మాట్లాడుతున్నా. ఆమెకు ఆయన అందజేసినది బహుమతి మాత్రమే’ అని శివకుమార్ మీడియాకు తెలిపారు. పరమేశ్వర పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయనే కాదు కాంగ్రెస్ నేతలెవ్వరూ తప్పుడు పనులు చేయరని ఆయన సమర్థించారు.