ముంబై, నవంబర్ 23: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరించి దేశీ మార్కెట్లో మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 క్షీణించి, రూ. 49,150వద్ద నిలిచింది. 22 క్యారెట్ల పసిడి రూ.690 మేర తగ్గి రూ.45,050 వద్దకు దిగింది. అమెరికా కేంద్ర బ్యాంక్ చైర్మన్‌గా జెరోమ్ పొవెల్‌ను మరో నాలుగేండ్లకు పునర్నియమించడంతో అక్కడ వడ్డీ రేట్లు త్వరలో పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో గత రాత్రి ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 45 డాలర్లు పడిపోయి రెండు వారాల కనిష్ఠస్థాయి 1,805 డాలర్ల వద్దకు చేరింది. ఈ కారణంగా భారత్‌లోనూ పసిడి ధర తగ్గింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.810 మేర క్షీణించింది.కాగా, బంగారం ధరకు అనుగుణంగానే వెండి సైతం తగ్గింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.900 క్షీణించి రూ.69,500 వద్దకు పడింది.