న్యూఢిల్లీ, డిసెంబర్ 29: బంగారం ధరలు ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న నేపథ్యంలో భారత జీడీపీ విలువను దేశ ప్రజలవద్దనున్న పసిడి విలువ దాటేసింది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీయుల వద్ద ప్రస్తుతం దాదాపు 34,600 టన్నుల పుత్తడి ఉందని అంచనా. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వాల్యూ ఇటీవల 4,550 డాలర్లను తాకింది. దీన్నిబట్టి ఈ మొత్తం విలువ 5 లక్షల కోట్ల డాలర్లపైనే. మరోవైపు దేశ జీడీపీ విలువ సుమారు 4.1 లక్షల కోట్ల డాలర్లుగానే ఉన్నది. దీంతో దేశ జీడీపీ కంటే ఇంటి బంగారమే ఎక్కువని తేలినైట్టెంది. కాగా, దేశంలోని కుటుంబీకుల వద్దనున్న బంగారంలో 75-80 శాతం నగలే. అటు వినియోగం (ధరించే వస్తువు)గా, ఇటు దీర్ఘకాలిక పొదుపుగా పుత్తడిని దేశ ప్రజలు చూస్తున్నారు. నిజానికి బంగారాన్ని ఇప్పటికీ మెజారిటీ భారతీయులు ఓ సెంటిమెంట్‌గానే చూస్తున్నారు.
దాన్ని ఆస్తిగా చూడలేకపోతున్నారని, అందుకే ఇంత విలువైన సంపద దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడకుండా పోతున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆపత్కాలంలో బంగారాన్ని తనఖాపెట్టి సులువుగా తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవచ్చన్న ఆలోచన కూడా చాలామందిని ఆభరణాల కొనుగోలు దిశగా నడిపిస్తున్నది. కానీ గత కొన్నేండ్లుగా ఇలా బంగారాన్ని వృథాగా ఉంచడానికి బదులు గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్ వైపునకు మళ్లించాలన్న సూచనలు పెరుగుతున్నాయి. నిజానికి ఇటీవలికాలంలో ఆభరణాల కంటే బంగారం కడ్డీలు, నాణేలను కొనేవారు పెరిగారు. మదుపరులు, ముఖ్యంగా యువత డిజిటల్ గోల్డ్‌కు ఓటేస్తున్నారు.
సెంట్రల్ బ్యాంకుల పోటీ
పసిడి నిల్వలను పెంచుకోవడంలో ఆర్బీఐ సహా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. భౌగోళిక-రాజకీయ అనిశ్చిత స్థితి నడుమ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా బంగారం నిల్వలను కేంద్ర బ్యాంకులు పెడుతున్నాయి మరి. ఈ విషయంలో పొరుగు దేశం చైనా అన్ని దేశాలకంటే ముందుంటున్నది. అలాగే అమెరికా డాలర్ నిల్వలను తగ్గించుకుని, వాటి స్థానాన్ని బంగారంతో భర్తీచేసే దేశాల సంఖ్య కూడా ఈమధ్య పెరుగుతున్నది. ఇది కూడా గ్లోబల్ మార్కెట్లో ధరల పెరుగుదలకు దారితీస్తున్నదని మార్కెట్ విశ్లేషకుల మాట. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులకు రక్షణగా బంగారం వైపే చూస్తున్నారు.
ఫ్యూచర్ మార్కెట్లో డౌన్
ఫ్యూచర్ మార్కెట్లో వెండి ధర భారీగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై సోమవారం ఒక్కరోజే కిలో రేటు రూ. 7,124 లేదా 2.97 శాతం దిగజారి రూ. 2,32, 663కు పరిమితమైంది. ఫలితంగా నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్పడినైట్టెంది. అయితే మార్చి డెలివరీకిగాను జరిగిన ఈ ట్రేడింగ్‌లో అంతకుముందు ఆల్‌టైమ్ హైని తాకుతూ కేజీ సిల్వర్ రూ.2,54,174గా నమోదైంది. ఈ నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో గరిష్ఠ స్థాయి నుంచి ముగింపు స్థాయిని చూస్తే రూ.21,511 పడిపోయినైట్టెంది. కాగా, స్పాట్ మార్కెట్లో వెండి ధర పరుగులు పెడుతూనే ఉన్నది. సోమవారం ఢిల్లీలో కిలో విలువ రూ.3,650 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,40,000గా నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి రేటు రూ.2,60, 000గా ఉన్నది. ఢిల్లీలో 24 క్యారెట్ పుత్తడి తులం రూ.500 క్షీణించి రూ.1,41,800గా ఉన్నది.