Gold Rate | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆల్‌టైమ్ హైలో స్థిరపడ్డాయి. సోమవారం ఒక్కరోజే దేశీయ మార్కెట్లో దాదాపు రెండున్నర వేలు పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. స్టాక్, ఫారెక్స్ మార్కెట్లతోపాటు బులియన్ మార్కెట్‌నూ షేక్ చేసేశాయి మరి. ఈ క్రమంలోనే ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.2,430 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా రూ.88, 500ను తాకింది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది.
ఇదీ సంగతి..
అగ్రరాజ్యంలోకి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంలపై 25 శాతం సుంకాలు వేస్తామని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలవగా.. బంగారం, వెండి తదితర కమోడిటీ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే స్పాట్ మార్కెట్లలో ఔన్స్ గోల్డ్ విలువ రికార్డు స్థాయిలో 2,900 డాలర్లు పలికింది. కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లోనూ రూ.2,932.69 డాలర్లుగా ట్రేడైంది. త్వరలోనే 3,000 డాలర్లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక సిల్వర్ ఔన్స్ 32.76 డాలర్లను చేరింది. ఈ ట్రెండ్ దెబ్బకు భారతీయ మార్కెట్లలోనూ హోల్‌సేల్, రిటైల్ నగల వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించింది. ఫలితంగా ఒక్కసారిగా రేట్లు పైపైకిపోయాయి. నిజానికి గతకొద్ది రోజులుగా గోల్డ్ మార్కెట్ దూకుడు మీదనే ఉన్నది. స్టాక్ మార్కెట్ల ఒడుదొడుకుల నడుమ ఇన్వెస్టర్లు.. సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడి వైపే అడుగులు వేస్తున్నారు. అయితే ట్రంప్ దుందుడుకు నిర్ణయాలతో వాణిజ్య యుద్ధానికి అవకాశాలుండటంతో పుత్తడి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే వీలే ఉన్నదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దీంతో మదుపరులు గోల్డ్‌పై ఇంకా ఇన్వెస్ట్మెంట్లు పెట్టవచ్చని అంచనా వేస్తున్నా రు. అదే జరిగితే సరికొత్త శిఖరాలను ధర లు అధిరోహించడం ఖా యమేనన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
హైదరాబాద్‌లో..
దేశ రాజధానిలో ధరలతో పోల్చితే హైదరాబాద్ మార్కెట్లో రేట్లు ఒకింత స్థిరంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తులం 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.87,060గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పసిడి ధర రూ.79,800గా నమోదైంది. గతంతో పోల్చితే వరుసగా రూ.390, రూ.350 చొప్పున పెరిగాయి. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,500గా ఉన్నది. మును పటితో చూస్తే రూ.1,000 పెరిగింది. ఇక ఎంసీఎక్స్‌పై ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్కుగాను 10 గ్రాములు రూ.940 పెరిగి రూ. 85,828గా నమోదైంది. జూన్‌కు రూ.1,015 ఎగిసి రూ.86,636గా ఉన్నది.
త్వరలో తులం లక్ష?
బంగారం ధరలు పెరుగుతున్న తీరును చూస్తే తులం లక్ష రూపాయలను తాకే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది. రేపటి రోజుల్లో పసిడి ధరలు మరింత పెరుగుతాయంటున్న మార్కెట్ నిపుణులు.. ఈ ఏడాది చివర్లో దేశీయ విపణిలోనే 10 గ్రాములు లక్ష రూపాయల మార్కును తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తున్నారు మరి. అయితే గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్స్ 2,900 డాలర్ల మార్కును దాటడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నది. మొత్తానికి ఈ ఏడాది ధరల స్థిరీకరణకు అవకాశాలు తక్కువేనన్న మాట మెజారిటీ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్నది.