న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. వరుసగా రెండోరోజూ మంగళవారం గోల్డ్ ధర రూ.1.55 లక్షల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమి కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,500 తగ్గి రూ.1,54,900కి పడిపోయింది. ధరలు తగ్గకముందు ఇది రూ.1,56,400గా ఉన్నది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం యథాతథంగా నమోదయ్యాయి. కిలో వెండి రూ.2.42 లక్షలుగా కొనసాగుతున్నది.
ఫెడరల్ రిజర్వు అధికారుల కఠిన వ్యాఖ్యలు, దీనికి తోడు డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం లోహాలపై ఒత్తిడిని పెంచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫెడ్ రిజర్వు ఉన్నతాధికారి వ్యాఖ్యలు ఈక్విటీలతోపాటు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం తగ్గి 4,315 డాలర్లకు పడిపోగా, వెండి 65.50 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.