Gold Investment | మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. మునుపెన్నడూలేని రికార్డు స్థాయిల్లో కదలాడుతున్నాయి. ఈ క్రమంలో మదుపరులు సైతం పుత్తడిపై పెట్టుబడులకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం అతిగా స్పందించడం తొందరపాటేనంటున్నారు. రాబోయే నెలల్లో ఒకేసారి పెద్ద ఎత్తున పెట్టుబడులకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
ప్రస్తుతం పసిడి ధరలు ఆల్‌టైమ్ హై స్థాయి దరిదాపుల్లో ఉన్నాయి. దీంతో మున్ముందు ఈ ధరల్లో దిద్దుబాటుకు అవకాశాలున్నాయని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే అధిక ధరల వద్ద పెట్టుబడులు పెట్టిన మదుపరులకు నష్టాలు తప్పవు. అందుకే గోల్డ్ పోర్ట్‌ఫోలియో పరిమాణాన్ని ఇన్వెస్టర్లు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో గోల్డ్ మార్కెట్ బుల్లీష్గానే ఉండే వీలున్నా.. షార్ట్-టర్మ్‌లో ఒడిదొడుకులకు ఆస్కారం ఉందని అంటున్నారు. దీనివల్ల ఒక రకమైన అయోమయం ఇన్వెస్టర్లలో నెలకొనవచ్చని, ఇది ఆకస్మిక క్రయవిక్రయాలకు దారితీయవచ్చని, అదంత మంచి పరిణామం కాదని వారు పేర్కొంటున్నారు.
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకొనేవారు తమ దగ్గరున్న మొత్తం నగదు నిల్వలను అందుకే వినియోగించవద్దని, కొద్ది మొత్తాలతోనే సదరు ఇన్వెస్ట్మెంట్లకు దిగాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. దేశీయంగా గడిచిన నెల రోజుల్లో గోల్డ్ రేట్లు డాలర్ల రూపేణా 6.3 శాతం, రూపాయల్లో 7.1 శాతం ఎగిశాయి. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 0.7 శాతం పడిపోయింది. ఇక గత ఏడాదితో పోల్చితే ఇప్పుడున్న బంగారం ధర డాలర్లలో 21.2 శాతం, రూపాయల్లో 28.8 శాతం ఎక్కువ. ఇక నిఫ్టీ 15.3 శాతం పెరిగింది. దీన్ని చూసి చాలామంది స్టాక్ మార్కెట్లలో మదుపు కంటే బంగారంపై పెట్టుబడులే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే ఇటీవలికాలంలో గోల్డ్‌పై ఇన్వెస్ట్మెంట్స్ క్రమేణా పెరిగిపోతున్నాయి.
వచ్చే 3-4 నెలల్లో బంగారం ధరలు 5 నుంచి 7 శాతం మేరకు పడిపోవచ్చని, అందుకే అతిగా పెట్టుబడులు మానుకోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బులియన్ అనలిస్ట్ మానవ్ మోదీ చెప్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే 3-6 నెలల్లో పసిడిపై పెట్టుబడులను సందర్భానుసారం పెడుతూపోవాలని సూచిస్తున్నారు. అయితే వచ్చే రెండేండ్లలో తులం ధర 86వేల మార్కును తాకవచ్చనీ మోదీ అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల దృష్ట్యా ఈక్విటీ మార్కెట్లు మరింత ఆటుపోట్లకు లోను కావచ్చని కనుక పసిడిపై పెట్టుబడులు పెద్దగా నష్టాల్ని తెచ్చిపెట్టకపోవచ్చని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్, కమోడిటీస్ విభాగం అధిపతి విక్రమ్ ధావన్ అంటున్నారు. అయితే స్వల్పకాలంలో ధరల్లో హెచ్చుతగ్గులు బాగా ఉంటాయని, ఈ పరిస్థితులను అధిగమిస్తే అంతా ఓకేనన్న అభిప్రాయాన్ని కనబరుస్తున్నారు. ఇక అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులూ బంగారం ధరలను ఎగదోయవచ్చన్న అంచనాలున్నాయి.