Gold | దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఆల్‌టైమ్ హైల్లో కదలాడుతున్నాయి. మొన్నటిదాకా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా.. తిరిగి పుంజుకున్నాయి. దీంతో చాలామంది అవసరమైతే తప్ప పసిడి కొనుగోళ్లకు వెళ్లడం లేదు. ఇంకొందరైతే రేట్లు మరింత తగ్గుతాయేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.83,000 దాటేసింది మరి. అయితే సరిగ్గా ఇప్పుడే లో క్యారెట్ గోల్డ్.. కొనుగోలుదారులకు చక్కని ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత), 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత)లే కాకుండా 18, 14, 10 క్యారెట్ బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. నిజానికి ఇప్పుడిప్పుడే ఈ లో క్యారెట్ గోల్డ్‌కూ డిమాండ్ కనిపిస్తుండటం మార్కెట్లో మారిన ట్రెండ్‌కు నిదర్శనం.
కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా ఇటీవలికాలంలో బడా జ్యుయెల్లర్స్, ప్రముఖ నగల వర్తకులు సైతం 18 క్యారెట్ బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. మరికొన్ని చిన్నచిన్న జ్యుయెల్లర్స్ 14, 10 క్యారెట్ బంగారు నగలనూ తెస్తున్నారు. పైగా భారతీయ మార్కెట్లో మెజారిటీ వాటా మిడిల్ క్లాస్ కస్టమర్లదే కావడంతో జ్యుయెల్లర్స్ దృష్టీ ఈ లో క్యారెట్ విభాగంపై గట్టిగానే పడుతున్నది. ఇక వీటిలోనూ నచ్చిన, రకరకాల డిజైన్లు ఇప్పుడు లభిస్తుండటం విశేషం. దీంతో ఎగువ మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి వర్గాలదాకా అంతా వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యువత కూడా మక్కువ చూపుతున్నది. అలాగే ధర తక్కువ కావడం, ఆకర్షణీయంగా కూడా ఉండటంతో మార్కెట్లో వీటికి నానాటికీ డిమాండ్ పెరుగుతూపోతున్నది. అందరి బడ్జెట్‌కు తగ్గట్టుగా అందుబాటులో ఉంటుండటంతో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకూ ఎక్కువగా వీటినే ఎంచుకుంటుండటం ఈ మధ్యకాలంలో పెరిగిందనే చెప్పవచ్చు.
22 క్యారెట్ నుంచి 10 క్యారెట్ వరకు ఆయా ఆభరణాల్లో బంగారం వినియోగం తగ్గుతున్నకొద్దీ వెండి, రాగి, జింక్, నికెల్, పల్లాడియం తదితర లోహాల వాటా పెరుగుతుంది. అందుకే వాటి ధరల్లో అంత తేడా. 22 క్యారెట్ బంగారు ఆభరణాల్లో బంగారం వాటా ఎక్కువగా ఉంటుంది కనుక సహజంగా వీటి రేటు అధికం. 24 క్యారెట్ గోల్డ్ రేటుకు దగ్గర్లోనే పలుకుతుంది. నిజానికి స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయలేం. అందుకే వాటిలో ఇతర లోహాలను కొద్దిగానైనా కలుపుతారు. ఇదే క్రమంలో గోల్డ్ క్యారెట్ తగ్గుతున్నకొద్దీ ఇతర లోహాల పరిమాణం పెరుగుతూపోతుంది. అంతమాత్రం చేత నాణ్యతకు ఢోకా ఉండదు. ఇంకా చెప్పాలంటే 22 క్యారెట్ కంటే 18 క్యారెట్ బంగారు ఆభరణాలే గట్టిగా ఉన్నాయని వినియోగదారులు చెప్తుండటం గమనార్హం.
ధరలు పెరిగాయనో.. డబ్బు సరిపడా లేదనో కాకుండా మీ బడ్జెట్లో ఆయా రకాల లో క్యారెట్ నగలను ఆనందంగా కొనేయండి. అయితే మోసాలకు తావు లేకుండా జాగ్రత్తపడటం మాత్రం మరిచిపోవద్దు. అన్ని నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా? లేదా? అన్నది కనుక్కోవడం మంచిది. ఇక వీటిని మళ్లీ అమ్ముకున్నా.. తరుగుపోను అందులోని బంగారానికి అప్పటి రేటు ఎలాగూ లభిస్తుంది. ధర తక్కువైతే అప్పుడు మరింత హై క్యారెట్ బంగారు నగలకు అప్‌గ్రేడ్ అయిపోండి.
రెండేండ్ల క్రితం దేశీయంగా నగల అమ్మకాల్లో 5 నుంచి 7 శాతంగా ఉన్న లో క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ వాటా.. ఇప్పుడు 15% దాటిపోవడం మారిన ట్రెండ్‌కు అద్దం పడుతున్నది.
ఒకప్పుడు నడుములు వంగిపోయేంతదాకా నగలు ధరించేవారు. భారీ డిజైన్లతో.. తులాలకొద్దీ బంగారాన్ని పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు అంతంత బరువైన నగలను వేసుకొనేందుకు సంపన్నులు సైతం ఇష్టపడటం లేదు. దీంతో మార్కెట్లో తేలికపాటి బంగారు నగలకే ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్ ఉంటున్నదని నగల వ్యాపారులు అంటున్నారు. నగల తయారీలో వచ్చిన కొత్త టెక్నాలజీ.. సంప్రదాయ, భారీ డిజైన్లనూ తక్కువ బంగారాన్ని వినియోగించి స్వల్ప బరువుకే అందుబాటులోకి తెచ్చేలా చేసిందని ప్రపంచ స్వర్ణ మండలి భారతీయ కార్యకలాపాల విభాగం సీఈవో సచిన్ జైన్ చెప్తున్నారు. మొత్తానికి లైట్ వెయిట్.. లో క్యారెట్ గోల్డ్ ఇప్పుడు పసిడి మార్కెట్‌ను శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు.